శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 18:44:55

అందరికీ కొవిడ్‌ టీకా అందాలంటే ఇంకా 35 బిలియన్ డాలర్లు అవసరం..!

అందరికీ కొవిడ్‌ టీకా అందాలంటే ఇంకా 35 బిలియన్ డాలర్లు అవసరం..!

న్యూయార్క్‌: ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మెజార్టీ ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందాలంటే ఇంకా 35 బిలియన్ డాలర్లు అవసరమని ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ అమీనా మహమ్మద్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి, చికిత్స, పరీక్షల గ్లోబల్‌ గోల్స్‌ను సాధించేందుకు ధనిక దేశాలు ముందుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచానికి అత్యవసరంగా కొవిడ్‌ టీకాల అభివృద్ధి, ఉత్పత్తి, సురక్షితమైన, సమర్థవంతమైన కొవిడ్‌-19 డయాగ్నోస్టిక్‌ చికిత్సా పద్ధతులు అవసరమని అమీనా పేర్కొన్నారు. 

ఈ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి, పునర్నిర్మించేందుకు కొవిడ్‌-19 టూల్స్ యాక్సిలరేటర్ (ఏసీటీ- యాక్సిలరేటర్) తమవద్ద ఉన్న పరిష్కార మార్గమని చెప్పారు. కొవిడ్‌నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు, ఎన్జీవోలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కేవలం ఐదు నెలల్లో ఏసీటీ యాక్సిలేటరీని ఏర్పాటు చేసి, విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కొవాక్స్‌లో ఇప్పటివరకూ 156 దేశాలు చేరాయని, అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లోని ప్రజలకు వ్యాక్సిన్‌ అందేలా చూడడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. అధిక ఆదాయ దేశాలు ముందుకొచ్చి 35 బిలియన్‌ డాలర్ల సాయంచేస్తే 2 బిలియన్ మోతాదుల వ్యాక్సిన్, 245 మిలియన్ చికిత్సలు, 500 మిలియన్ల పరీక్షా కిట్ల ఉత్పత్తికి మార్గం సుగమమవుతుందని ఆమె పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో తప్పనిసరిగా 15 బిలియన్ డాలర్లు అవసరమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo