ఆదివారం 31 మే 2020
International - Apr 02, 2020 , 01:39:39

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. ఇదే పెను సంక్షోభం!

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. ఇదే పెను సంక్షోభం!

-కరోనా వైరస్‌తో ఎన్నడూ ఎరుగని ఆర్థిక మాంద్యం

-ప్రపంచదేశాలు ఏకమవ్వాలి

-పేద దేశాలకు సాయంచేయాలి

-ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పిలుపు

ఐక్యరాజ్యసమితి, ఏప్రిల్‌ 1: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సంక్షోభం కరోనా మహమ్మారేనని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు. ఇది ప్రజల ప్రాణాలను హరించడంతోపాటు ఇటీవలి కాలంలో ఎన్నడూ ఎరుగని ఆర్థిక సంక్షోభంలోకి ప్రపంచాన్ని నెడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘సామాజిక, ఆర్థిక రంగాల మీద కరోనా ప్రభావం’పై బుధవారం ఆయన ఒక నివేదికను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 75 ఏండ్ల ఐరాస చరిత్రలో ఎన్నడూ చూడని అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ప్రాణాలు పోతున్నాయని, ప్రజల జీవితాలు తలకిందులవుతున్నాయని అన్నారు. ఇది కేవలం ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదని, అంతకుమించి మానవ సంక్షోభం అని వ్యాఖ్యానించారు. రాజకీయ వైరాలను పక్కనబెట్టి, అందరూ ఏకతాటిపైకి వస్తేనే విశ్వమారిని సమర్థంగా ఎదుర్కొనగలుగుతామని సూచించారు. పేద దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.  

ఆ వర్గాలను ఆదుకోవాలి..

కరోనా వ్యాప్తి కట్టడికి ప్రపంచదేశాల మధ్య సమన్వయంతో కూడిన వైద్య సహకారం అవసరమని పిలుపునిచ్చారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, క్వారంటైన్‌, చికిత్స సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. వైరస్‌ కబళిస్తున్న దేశాలకు, మెరుగైన వైద్య వ్యవస్థలు లేని పేద దేశాలకు అగ్రరాజ్యాలు తోడ్పాటునందించాలని విజ్ఞప్తిచేశారు. దివాళా, ఉద్యోగాల కోతను నిరోధించేందుకు పరిశ్రమలకు చేయూతనివ్వాలని కోరారు. కరోనాను ఎదుర్కొనే విస్తృత, సమన్వయ, సమగ్ర చర్యల కోసం తక్షణం ప్రపంచ జీడీపీలో కనీసం పది శాతం అవసరమవుతుందన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా ‘మల్టీపార్ట్‌నర్‌ ట్రస్ట్‌ ఫండ్‌'ను ఏర్పాటుచేస్తున్నట్లు గుటెరస్‌ వెల్లడించారు.

కరోనా ప్రభావంపై ఐరాస సంస్థల అంచనాలు..

  • ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది.
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 30-40 శాతం క్షీణించనున్నాయని యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) పేర్కొంది.
  • అంతర్జాతీయ పర్యటనలు 20-30 శాతం తగ్గనున్నాయని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనావేసింది. 
  • 3.6 బిలియన్ల మంది ఇంటర్నెట్‌కు దూరం కానున్నారని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) అంచనావేసింది. 
  • 1.5 బిలియన్ల మంది విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని యునెస్కో ఆందోళన వ్యక్తంచేసింది.


logo