ఆదివారం 24 మే 2020
International - Jan 12, 2020 ,

పొరపాటున కూల్చాం

పొరపాటున కూల్చాం

ఇరాన్‌లో ఉక్రెయిన్‌ విమానం కూలిన ఘటనలో అనుమానాలే నిజమయ్యాయి. ఈ క్షిపణి కారణంగానే విమానం కూలిందన్న ఆరోపణలను తొలుత నిరాకరించిన ఇరాన్‌.. ఎట్టకేలకు తప్పును అంగీకరించింది. తామే విమానాన్ని కూల్చామని వెల్లడించింది.

  • శత్రుదేశ విమానంగా పొరబడి క్షిపణుల ప్రయోగం
  • బాధ్యులను శిక్షించాలని ఉక్రెయిన్‌, కెనడా డిమాండ్‌
  • ‘క్షమించరాని తప్పిదం’..
  • బాధిత కుటుంబాలకు రౌహనీ క్షమాపణలు

టెహ్రాన్‌/కీవ్‌/ఒట్టావా, జనవరి 11: ఇరాన్‌లో ఉక్రెయిన్‌ విమానం కూలిన ఘటనలో అనుమానాలే నిజమయ్యాయి. ఈ క్షిపణి కారణంగానే విమానం కూలిందన్న ఆరోపణలను తొలుత నిరాకరించిన ఇరాన్‌.. ఎట్టకేలకు తప్పును అంగీకరించింది. తామే విమానాన్ని కూల్చామని వెల్లడించింది. ఇది ఉద్దేశపూర్వకంగా కాకుండా, మానవ తప్పిదం కారణంగానే జరిగిందని వివరించింది. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ స్పందిస్తూ.. మానవ తప్పిదంతో క్షిపణులు ప్రయోగించడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు మిలిటరీ అంతర్గత దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఇది ‘క్షమించరాని తప్పిదం’గా పేర్కొన్నారు. ఇరాన్‌ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని, మరోసారి ఇలాంటి విపత్తు జరుగకుండా చూడాలని తమ దేశ సాయుధ బలగాలను ఆదేశించారు.

ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం బుధవారం వేకువజామున టెహ్రాన్‌ విమానాశ్రయం నుంచి కీవ్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్‌ విమానంలోని 176 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇరాన్‌కు చెందిన 82 మంది, కెనడాకు చెందిన 63 మందితోపాటు ఉక్రెయిన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బ్రిటన్‌, స్వీడన్‌కు చెందినవారు కూడా ఉన్నారు. తమ అగ్రశ్రేణి కమాండర్‌ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణుల వర్షం కురిపించిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరుగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇరాన్‌ హస్తమున్నదని అమెరికా, కెనడా సహా పలుదేశాలు ఆరోపించాయి. వీటిని ఇరాన్‌ ఖండిస్తూ వచ్చింది. అయితే వేగంగా వచ్చిన ఒక వస్తువు విమానాన్ని ఢీకొన్నట్లు ఒక వీడియో బయటకు రావడంతో ఇరాన్‌ ఇరకాటంలో పడింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగడంతో తప్పును అంగీకరించింది.  


శత్రు విమానంగా పొరబడి..

జరిగిన తప్పిదాన్ని తొలుత ఇరాన్‌ మిలిటరీ గుర్తించింది. ఉక్రెయిన్‌ విమానాన్ని శత్రు విమానంగా పొరబడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి తమ యూనిట్‌ పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన కమాండర్‌ జనరల్‌ ఆమిర్‌ అలీ హజిజాదే చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ‘తాను చనిపోయి ఉంటే బాగుండు’ అని అనిపించిందన్నారు.   


బాధిత కుటుంబాలకు పరిహారం

రౌహనీ స్పందిస్తూ.. ‘ఈ ఘోర తప్పిదం పట్ల ఇరాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నది. ఇరాన్‌ తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించా. ఈ బాధాకరమైన ఘటన నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. క్షమించరాని తప్పిదానికి పాల్పడినవారిపై విచారణ జరిపిస్తాం. మరోసారి ఇలాంటి తప్పిదం జరుగకుండా చూసేందుకు దేశ రక్షణ వ్యవస్థలోని లోపాలను తొలిగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. 


అమెరికా దుస్సాహసం వల్లే.. 

ప్రమాదంపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ జావద్‌ జరీఫ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. అమెరికా దుస్సాహసం వల్లే ఈ పొరపాటు జరిగిందని విమర్శించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజలకు, ఇతర దేశాలకు చెందిన బాధిత కుటుంబాలకు క్షమాపణలు, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు, క్రాస్‌ ఇన్వెస్టిగేషన్‌కు అమెరికా, ఉక్రెయిన్‌, కెనడా, ఇతర దేశాలను ఇరాన్‌ ఆహ్వానించింది.  ఇరాన్‌లో జరిగిన రెండో అతిపెద్ద పౌర విమాన ప్రమాదం ఇది. 1988లో అమెరికా పొరపాటున ఇరాన్‌ విమానాన్ని కూల్చివేసిన ఘటనలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. 


బాధ్యులను శిక్షించాలి: ఉక్రెయిన్‌

విమాన ప్రమాదంపై ఇరాన్‌ తప్పును అంగీకరించడంపై ఉక్రెయిన్‌ స్పందించింది. బాధ్యులను శిక్షించాలని, బాధితులకు పరిహారం అందజేయాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ డిమాండ్‌ చేశారు. దోషులను ఇరాన్‌ కోర్టు ముందు ప్రవేశపెడుతుందని తాము భావిస్తున్నామని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఆటంకం, జాప్యం లేకుండా దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. పూర్తి దర్యాప్తు చేపట్టేందుకు 45 మంది ఉక్రెయిన్‌ నిపుణుల బృందానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ.. ఘటనకు ఇరాన్‌ బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. విమాన కూల్చివేతపై దర్యాప్తు పారదర్శకంగా జరిపించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. ‘ఇది జాతీయ విషాదం. కెనడా ప్రజలందరూ శోకసంద్రంలో ముగిపోయారు. సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు మా మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తాం. ఇరాన్‌ అధికారులు పూర్తిగా సహకరిస్తారని కెనడా ప్రభుత్వం భావిస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు. ఈ దుర్ఘటన నుంచి ఇరాన్‌ పాఠాలు నేర్చుకోవాలని రష్యా పార్లమెంట్‌కు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ కాన్‌స్టాంటిన్‌ కొసచెవ్‌ సూచించారు. ఫ్రాన్స్‌ రక్షణమంత్రి ఫ్లొరెన్స్‌ పార్లే స్పందిస్తూ.. ఇరాన్‌ అణు ఒప్పందంపై సంప్రదింపులకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ నాటకీయ పరిణామాల నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే.. ఈ ఉద్రిక్తతలకు తక్షణమే ముగింపు పలుకాలని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా ఇరాన్‌ చర్యలు తీసుకోవాలని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్‌ సూచించారు.


logo