శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 19:23:41

బ్రిట‌న్ రాణి వేస‌వి విడిదికి ఏర్పాట్లు!

బ్రిట‌న్ రాణి వేస‌వి విడిదికి ఏర్పాట్లు!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త నాలుగు నెల‌ల నుంచి సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌-2.. ఇక వేస‌వి విడిది కోసం వ‌చ్చే నెల‌లో స్కాట్లాండ్‌కు వెళ్ల‌నున్నారు. ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కూడా ఆగ‌స్టులో భ‌ర్త ప్రిన్స్ ఫిలిప్‌, ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి స్కాట్లాండ్‌లోని బ‌ల్మోర‌ల్‌కు బ‌య‌లుదేర‌నున్నారు. అయితే ఎప్ప‌టిలాగా కాకుండా ఈ సారి బల్మోర‌ల్‌లోని హైలాండ్స్ ఎస్టేట్‌లోగ‌ల వేర్వేరు లాడ్జీల్లో రాణి ఎలిజ‌బెత్‌ కుటుంబ‌స‌భ్య‌లు బ‌స‌చేయ‌నున్నారు. క‌రోనా మ‌హమ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో వారు ఈ మేర‌కు సామాజిక దూరం పాటించ‌నున్నారు. 

ఈసారి రాణి ఎలిజ‌బెత్ త‌న రాజ‌భ‌వ‌నంలో కుటుంబ‌స‌భ్యులు ఎవ‌రికీ ఆతిథ్యం ఇవ్వ‌డంలేదు. అయితే, వారితో క‌లిసి వాకింక్‌, పిక్నిక్ లాంటి కార్య‌క్ర‌మాల్లో ఆమె పొల్గొననున్నారు. బ్రిట‌న్‌కు చెందిన సండే టైమ్స్ ప‌త్రిక ఈ వివ‌రాల‌ను ప్ర‌చురించింది. అయితే క‌రోనా క‌ట్ట‌డికి నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠినత‌రం అయితే మాత్రం ఈ ఏడాది బ్రిట‌న్ రాజ‌కుటుంబం వేస‌వి విడిది ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది.

కాగా, బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ రాణిగా ప‌ట్టాభిషేకం జ‌రుపుకుని 68 ఏండ్ల‌య్యింది. ఈ 68 ఏండ్ల‌లో ప్ర‌తి ఏడాది ఆగ‌స్టులో 12 వారాల‌పాటు స్కాట్లాండ్‌లోని బ‌ల్మోర‌ల్‌లో ఆమె వేస‌వి విడిది చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎప్ప‌టిలాగే ఈసారి కూడా ఎలిజ‌బెత్‌ త‌న హాలిడే టూర్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సండే టైమ్స్ పేర్కొన్న‌ది. అదేవిధంగా రాణి ఎలిజబెత్ బ్రిట‌న్ సింహాసనం అధిష్టించి 25,000 రోజుల‌య్యింద‌ని ఆ ప‌త్రిక తెలిపింది. 

అయితే, బ్రిట‌న్ రాణి వేస‌వి విడిదికి ఏర్పాట్లు చేసుకుంటున్నార‌న్న‌ వార్త‌ల‌పై స్పందించేందుకు బ్రిట‌న్ రాజ‌భ‌వ‌నం అయిన బ‌కింగ్‌హామ్ ప్యాలెస్ నిరాక‌రించింది. అది ఆమె వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, దానిపై త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని తెలిపింది.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo