శుక్రవారం 15 జనవరి 2021
International - Jan 05, 2021 , 17:40:02

బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ పర్యటన వాయిదా.. ఎందుకంటే?

బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ పర్యటన వాయిదా.. ఎందుకంటే?

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ న్యూ స్ట్రెయిన్‌ ప్రభావంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యంలోనే బోరిస్‌ జాన్సన్‌ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్‌ ఓ వార్తాకథనం ప్రచురించింది. 

ప్రతిఏటా జనవరి 26వ తేదీన భారత్‌ రిపబ్లిక్ డే వేడుకలకు ఒక విదేశీ అదినేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే ఈ ఏడాది రిపబ్లిక్‌ డే దినోత్సవాలకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. 

మోదీ ఆహ్వానాన్ని బోరిస్‌ జాన్సన్ అంగీకరించారు కూడా. అయితే బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ ఉధృతం అవుతుండటంతో గత నెలలోనే భారత్‌లో బోరిస్ జాన్సన్‌ పర్యటన అనుమానమేనని అధికార వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

 తన పర్యటనను వాయిదా వేసుకున్న సంగతిని భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌లో బోరిస్‌ జాన్సన్‌ చెప్పారని జాన్సన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించలేకపోతున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేశారన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.