శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 06, 2021 , 01:57:42

సారీ! భారత్‌కు రాలేకపోతున్నా..

సారీ! భారత్‌కు రాలేకపోతున్నా..

మోదీకి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ ఫోన్‌ 

గణతంత్ర వేడుకలకు హాజరుకాలేనని వెల్లడి

‘కొత్త రకం కరోనా’ ఉద్ధృతితో బోరిస్‌ పర్యటన వాయిదా

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన వాయిదా పడింది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. జనవరి 26న భారత రిపబ్లిక్‌ వేడుకల్లో ముఖ్య అతిథిగా తాను పాల్గొనలేనని బోరిస్‌ చెప్పినట్టు వెల్లడించారు. ఈ మేరకు బోరిస్‌ భారత ప్రధాని మోదీతో మంగళవారం ఉదయం ఫోన్లో సంభాషించినట్టు వివరించారు. ‘బోరిస్‌ మంగళవారం మోదీతో ఫోన్లో మాట్లాడారు. గతనెలలో ఖరారైన భారత పర్యటనకు తాను (బోరిస్‌) హాజరుకాలేకపోతున్నట్టు చెప్పారు. బ్రిటన్‌లో కొత్త వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను దేశంలో ఉండాల్సిన అవసరమున్నదని మోదీకి వివరించారు. భారత గణతంత్ర వేడుకలకు హాజరుకాలేకపోవడంపై తాను ఎంతగానో చింతిస్తున్నట్టు బోరిస్‌ చెప్పారు’ అని ఆ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో భారత్‌లో తప్పక పర్యటిస్తానని బోరిస్‌ ఈ సందర్భంగా మోదీకి చెప్పినట్టు తెలిపారు. 

బ్రిటన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

కొత్త రకం కరోనాతో బ్రిటన్‌ అతలాకుతలం అవుతున్నది. రోగులతో దవాఖానలన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘స్టే ఎట్‌ హోం లాక్‌డౌన్‌ (ఇండ్లలోనే ఉండాలని నిబంధన)’ను బోరిస్‌ విధించారు. ప్రజలెవ్వరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 


logo