శనివారం 16 జనవరి 2021
International - Dec 27, 2020 , 16:24:57

లాక్‌డౌన్‌లో ప్రియురాలిని వేధించిన ప్రియుడికి జైలు శిక్ష

లాక్‌డౌన్‌లో ప్రియురాలిని వేధించిన ప్రియుడికి జైలు శిక్ష

లండన్‌: కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ కాలంలో నెలలపాటు ప్రియురాలిని వేధించి హింసించిన ప్రియుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. బ్రిటన్‌కు చెందిన 31 ఏండ్ల సెరెన్‌కు 24 ఏండ్ల పాల్ రాబర్ట్ మోర్గాన్ రిచర్డ్స్ కీగన్‌తో పరిచయం ఏర్పడింది. 2018 జూలై నుంచి వారిద్దరు కలిసి ఉంటున్నారు. ఐదారు నెలల వరకు బాగానే ఉన్నారు. అయితే కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి సెరెన్‌పై వేధింపులు, గృహ హింస మొదలయ్యాయి. ఆ ఇంటి నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్న ప్రతిసారి రిచర్డ్స్ కీగన్‌ ఆమెను బెదిరించేవాడు. అతడి దాడి వల్ల అయిన గాయాల ఫోటోలు, వీడియోలు జనవరి నుంచి ఆమె తీసింది. 

రిచర్డ్స్ మార్చి 30న సెరెన్‌ జుట్టపట్టుకుని ముఖాన్ని గోడకేసి కొట్టి ముఖంపై ఉమ్మి వేశాడు. ఈ దాడిలో ఆమె నోటి నుంచి రక్తం కారింది. పోలీసులకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా చంపేస్తానని అతడు బెదిరించాడు. మే 30న ఒక అంశంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు కూడా ఆమె ముఖాన్ని గోడకేసి బాదగా మళ్లీ నోటి వెంట రక్తం కారింది. జూన్‌ 19న పడక గదిలో మరోసారి దాడి చేశాడు. ఆమె వీపుపై అతడి చేతివేళ్ల వాతలు తేలాయి. జూలైలో ఇంటి నుంచి వెళ్లేందుకు సెరెన్‌ ప్రయత్నించగా గొంతు నొక్కి హింసించాడు. ఆగస్ట్‌లో తమ మధ్య సంబంధం ముగిసిపోయిందని, పోలీసులకు ఫోన్‌ చేస్తానని ఆమె చెప్పగా కత్తితో పొడిచి చంపుతానని బెదిరించాడు. 

ఆగస్ట్‌ 22న రిచర్డ్స్ కీగన్‌ను కార్యాలయం నుంచి సెరెన్‌ తీసుకురాలేదు. దీంతో కోపంతో ఇంటికి రాగా తలుపు తీయలేదు. అయితే ఏమీ చేయనని అతడు చెప్పడంతో ఆమె డోర్‌ తీసింది. లోనికి వచ్చిన వెంటనే ఆమెపై హింసకు పాల్పడ్డారు. ఆమె భయంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లబోగా గొంతుపట్టుకుని పలుసార్లు నొక్కాడు. ఊపిరాడక ఆమె కేకలు వేయడంతో పొరుగువారు పోలీసులకు ఫోన్‌ చేశారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల వద్ద తన బాధను వెళ్లగక్కింది. రిచర్డ్స్ కీగన్‌ కొన్ని నెలలుగా పెడుతున్న శరీరక, మానసిక హింస గురించి చివరకు పోలీసులకు వెల్లడించింది. 

దీంతో రిచర్డ్స్‌ను అరెస్ట్‌ చేసి ప్రశ్నించారు. కాగా, కేసు వెనక్కి తీసుకోవాలంటూ సెరెన్‌ను బెదిరించడంతోపాటు ఆమె పేరెంట్స్‌పై ఒత్తిడి తెచ్చాడు. చివరకు స్వాన్సీ క్రౌన్ కోర్టు డిసెంబర్‌ 22న రిచర్డ్స్ కీగన్‌కు జైలు శిక్ష విధించింది. దీంతో సగం జీవిత కాలం అతడు జైలులోనే ఉండనున్నాడు. మరోవైపు ఇకపై మగవారిని ఎవరిని కూడా నమ్మనని సెరెన్‌ తెలిపింది. మానసిక గాయాల నుంచి కోలుకోవడానికి తనకు చాలా కాలం పడుతుందని ఆమె పేర్కొంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.