శనివారం 08 ఆగస్టు 2020
International - Jul 09, 2020 , 19:27:58

మా హోటళ్లలో 50% డిస్కౌంట్.. సర్కారు బంపర్‌ ఆఫర్‌

మా హోటళ్లలో 50% డిస్కౌంట్.. సర్కారు బంపర్‌ ఆఫర్‌

బ్లూమ్‌బెర్గ్ : కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. ఈ వైరస్ కారణంగా అన్నిరకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు గత మూడు నెలలుగా మూతపడ్డాయి. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకొని భోజనం వడ్డిస్తున్నా.. అతిథులు కరువైపోవడంతో అల్లాడిపోతున్నాయి. ఇండియా మొదలుకొని కెనడా వరకు ఆతిథ్య సేవల రంగం పెద్ద సమస్యనే ఎదుర్కొంటున్నది. 

ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్తగా డిస్కౌంట్ పద్ధతిని తీసుకొచ్చింది. పనిలో పనిగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకొనే పనిలో పడింది. బ్రిటన్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేయండి.. 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ పొందండి అంటూ బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆతిథ్య పరిశ్రమపై మహమ్మారి భారాన్ని తగ్గించడంలో సహాయపడేందుకు విస్తృత ప్యాకేజీలో భాగంగా ఆగస్టు నెలంతా హోటల్, రెస్టారెంట్ భోజనంపై యూకే భోజనప్రియులకు 50 శాతం తగ్గింపు లభిస్తుందని బ్రిటన్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ రిషి సునాక్ వెల్లడించారు.

కొవిడ్-19 వ్యాప్తి చెందడంతో హోటళ్లు మూసివేయాలని బలవంతం చేసిన తరువాత.. ప్రస్తుతం "ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్" పథకాన్ని ప్రారంభించారు. తెరుచుకున్న బార్లు, రెస్టారెంట్లలో మీకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకొని ఎంజాయ్ చేయండి అని ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ 50 శాతం డిస్కౌంట్ పథకం సోమవారం నుంచి బుధవారం వరకు ఆహారం, మద్యపానరహిత పానీయాలను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఆహారం, వసతి, ఆకర్షణల కోసం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ను తగ్గించడం, 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వంటి చర్యలు ఆతిథ్య పరిశ్రమకు సహాయం చేయడానికి ఉద్దేశించిన మరిన్ని చర్యలను ఛాన్సలర్ ప్రకటించారు. ఇదే సమయంలో కరోనా వైరస్ పూర్తిగా అంతం కానందున హోటళ్లు, బార్లకు వచ్చేవారు విధిగా భౌతిక దూరం పాటించాలని, ముఖాలకు మాస్కులు ధరించాలని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది.


logo