ఫైజర్‌కు బ్రిటన్ గ్రీన్‌సిగ్నల్.. వచ్చే వారంలోనే వ్యాక్సిన్

వాషింగ్టన్: ప్రపంచంలోనే తొలిసారి ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారంలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించాలని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చేసిన సిఫారసును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. యునైటెడ్ కింగ్డమ్ వ్యాప్తంగా వచ్చే వారం నుంచే ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి సాధించడంపై ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎంహెచ్ఆర్ఏకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాము మరిన్ని దేశాల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యత ఉన్న వ్యాక్సిన్లను అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే బ్రిటన్‌లోని ఆసుపత్రులన్నీ వ్యాక్సిన్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారంలోనే ఈ కార్యక్రమం మొదలవుతుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ చెప్పారు. ముందుగా వైద్య సిబ్బంది, కొవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే బ్రిటన్ 4 కోట్ల వ్యాక్సిన్లను ఆర్డర్ చేసింది. వీటిని 2 కోట్ల మందికి ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పొన ఇవ్వవచ్చు. అతి త్వరలోనే కోటి డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఫైజర్ కేవలం పది నెలల్లోనే వ్యాక్సిన్‌ను తయారు చేసి, ప్రయోగాలు నిర్వహించి, అనుమతులు సాధించడం విశేషం. సాధారణంగా దీనికి దశాబ్దాల సమయం కూడా పడుతుంది.