శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 09:18:07

కరోనా సోకితే.. కుక్కలు పసిగడుతున్నయ్‌!

కరోనా సోకితే.. కుక్కలు పసిగడుతున్నయ్‌!

దుబాయి : అవును.. మీరు చదివింది నిజమే..! కరోనా సోకిన వారిని కుక్కలు పసిగడుతున్నయ్‌. యూఏఈలోని ఎయిర్‌పోర్టుల్లో కరోనా వైరస్‌ జాడలున్న వారిని గుర్తించడంలో కే9 డాగ్స్‌ సహాయపడుతున్నాయి. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్స్‌తో ప్రయాణీకుల నుంచి సేకరించిన స్వాబ్‌లను ఉపయోగించి వైరస్‌ సోకిందో లేదో తెలుసుకుంటున్నట్లు దుబాయి పోలీస్ విభాగానికి చెందిన మేజర్ సలాహ్ అల్ మజ్రూయీ వివరించారు.

‘హెల్త్ అథారిటీ అధికారులు సేకరించిన నమూనాల ఫలితాలు.. ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో వస్తున్నాయని’ తెలిపారు. మనిషి నుంచి వచ్చే వాసనను పసిగట్టి కొవిడ్‌-19 జాడలను గుర్తించగలుగుతున్నాయని భావిస్తున్నారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ రూంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా పరికరాల్లో స్వాబ్‌లను సీసాలో వేసి ఉంచడం ద్వారా వాటి వాసన చూస్తుంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా ఉన్నస్వాబ్‌ వద్ద డాగ్‌ ఆగుతుంది.

‘పరీక్ష సులభంగా ఉంది. ఇంత త్వరగా ఫలితాలు రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను’ అంటూ ఓ ప్రయాణికుడు పేర్కొన్నాడు. యూఏఈ వ్యాప్తంగా అన్ని విమానాశ్రాయాల్లో కే9 డాగ్స్‌ను కరోనా రోగులను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. దేశంలోకి వచ్చేందుకు, విడిచి వెళ్లేందుకు ప్రస్తుతం యూఏఈ కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. ఎంపిక చేసిన దేశాల నుంచే వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా కరోనా నెగెటివ్‌ ఉన్నట్లు రిపోర్ట్‌ చూపాలని ఆగస్టు 1 నుంచి తప్పని సరిచేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
logo