బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 00:55:38

యూఏఈ మార్స్‌ మిషన్‌

యూఏఈ మార్స్‌ మిషన్‌

  • l అంగారకుడి మీదకు ‘హోప్‌ ప్రోబ్‌' స్పేస్‌క్రాఫ్ట్‌
  • l తొలి అరబ్‌ దేశంగా రికార్డు

దుబాయ్‌: అంతరిక్ష రంగంలో దుబాయ్‌ చరిత్ర సృష్టించింది. సోమవారం తన అంగారకయాత్రను విజయవంతంగా ప్రారంభించింది. ఆ దేశం నిర్మించిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ ‘అల్‌ అమాల్‌ లేదా హోప్‌ ప్రోబ్‌'ను మార్స్‌ మీదకు పంపడంలో భాగంగా తొలిదశను పూర్తి చేసింది. సోమవారం ఉదయం జపాన్‌లోని తెనెగాషిమా స్పేస్‌ పోర్టు నుంచి హెచ్‌-2ఏ రాకెట్‌ ద్వారా  స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలో పంపించారు. ప్రయోగం జరిపిన గంట తర్వాత రాకెట్‌ నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ విడిపోయింది. తర్వాత హోప్‌ ప్రోబ్‌ నుంచి సంకేతాలు అందినట్టు దుబాయ్‌లోని మహ్మద్‌ బిన్‌ రషీద్‌ స్పేస్‌ సెంటర్‌ తెలిపింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి అరబ్‌ దేశంగా దుబాయ్‌ రికార్డులకెక్కింది. హోప్‌ ప్రోబ్‌ బ్యాటరీని చార్జ్‌ చేసుకునేందుకు సోలార్‌ ప్యానెళ్లను అమర్చారు. వాటి సహాయంతోనే అది 200 రోజులు 49 కోట్ల కిమీ ప్రయాణించి మార్స్‌ను చేరుకుంటుంది. స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడం పట్ల దుబాయ్‌ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా, యువరాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ హర్షం వ్యక్తం చేశారు. సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలోనూ శాస్త్రవేత్తలు అద్భుతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ విజయం అరబ్‌ దేశాల్లో యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ ప్రయోగం పట్ల దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కూడా అభినందనలు తెలిపింది. హోప్‌ ప్రోబ్‌ బరువు 1.3 టన్నులు. దీనిని తయారు చేయడానికి దుబాయ్‌ దాదాపు రూ. 15వందల కోట్లు ఖర్చు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇది మార్స్‌ను చేరుకుంటుందని భావిస్తున్నారు. మార్స్‌పై వాతావరణానికి సంబంధించి హోప్‌ ప్రోబ్‌ స్పష్టమైన సమాచారం ఇవ్వనుంది. 687 రోజుల పాటు మార్స్‌పై దీని అధ్యయనం సాగనున్నది.


logo