ఆదివారం 06 డిసెంబర్ 2020
International - Nov 03, 2020 , 02:21:50

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

  • ట్రంప్‌, బిడెన్‌ భవితవ్యం తేల్చనున్న  23.9 కోట్ల మంది అమెరికన్‌ ఓటర్లు
  • అగ్రరాజ్యాధిపతి ఎవరన్నదానిపై అమితాసక్తి
  • ఎన్నికల విధానంపై ప్రపంచమంతా ఉత్సుకత

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యాధిపతి ఎన్నికల సమయం రానే వచ్చింది. అమెరికా 46వ అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఆ దేశ ప్రజలు మంగళవారం ఓటు వేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ ఈ ఎన్నికల్లో ఢీకొంటున్నారు. 23.9 కోట్ల మంది ఓటర్లలో ముందస్తు బ్యాలెట్‌, మెయిల్‌ ఇన్‌ విధానం ద్వారా ఇప్పటికే 9.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో ఈసారి ఓటరు నాడి పట్టడం ఎవరికీ సాధ్యమవటం లేదు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయనే కుతూహలం అంతటా కనిపిస్తున్నది. మన దేశంలో ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు వేయటం.. వారు ప్రధాని, ముఖ్యమంత్రులను ఎన్నుకోవటం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకొనే విధానం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది.  -వాషింగ్టన్‌

ప్రతినిధుల సభలకు కూడా..

అమెరికా ఓటర్లు మంగళవారం కొత్త అధ్యక్షుడి కోసం మాత్రమే కాకుండా ప్రతినిధుల సభల సభ్యులను ఎన్నుకోవటానికి కూడా ఓటు వేస్తున్నారు. నాలుగేండ్లకోసారి అధ్యక్ష ఎన్నికలతోపాటు 435 స్థానాలున్న ప్రతినిధుల సభకు (హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌) కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి కూడా ఓటర్లు ప్రతినిధుల సభ సభ్యులను ఎన్నుకోనున్నారు. అమెరికా చట్టసభల్లో అత్యంత కీలకమైన సెనేట్‌లో మూడోవంతు స్థానాలకు కూడా మంగళవారం ఓటింగ్‌ జరుగుతున్నది. సెనేట్లో నాలుగేండ్లకోసారి మూడోవంతు సీట్లు ఖాళీ అవుతాయి. వాటికి అధ్యక్ష ఎన్నికలతోపాటు ఓటింగ్‌ నిర్వహిస్తారు. వీటితోపాటు 11 రాష్ర్టాల గవర్నర్లను, రాష్ర్టాల చట్టసభల్లో ఖాళీ అయిన 86 స్థానాలకు సభ్యులను ఎన్నుకొనేందుకు కూడా అమెరికన్లు ఓటు వేయనున్నారు. 

ఇదీ ఎన్నిక పద్ధతి

అమెరికాలో ప్రజాస్వామ్యమే ఉన్నా మనదేశంలోలాగా పార్లమెంటరీ ప్రభుత్వం కాదు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం నడుస్తున్నది. 

భారత్‌లో ఓటర్లు నేరుగా ముఖ్యమంత్రి, ప్రధాని పదవులకు ఓట్లు వేయనట్టే అమెరికా ఓటర్లు కూడానేరుగా అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయరు.

ఎన్నికల సమయంలో అభ్యర్థి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ అన్ని రాష్ర్టాల్లో ప్రతినిధులను నియమిస్తుంది. ఓటర్లు ఆ ప్రతినిధులకు ఓట్లు వేస్తారు. వారిని ఎలక్టోరల్‌ కాలేజీ అంటారు. ఆ ఎలక్టోరల్‌ కాలేజీ దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.  

అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశంలోని 50 రాష్ర్టాలు, కొలంబియా జిల్లాలో కలిసి మొత్తం 538 ఎలక్టోరల్‌ స్థానాలు ఉన్నాయి. ఈ ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో జనాభాను బట్టి మారుతూ ఉంటుంది. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో మూడే ఉన్నాయి. 

మొత్తం ఎలక్టోరల్‌ ఓట్లలో కనీసం 270 ఓట్లు వచ్చిన అభ్యర్థి అమెరికా అధ్యక్షుడు అవుతారు. 

అగ్రరాజ్యం ఎన్నికల్లో పాపులర్‌ ఓటు విధానం అత్యంత కీలకమైనది. ఒక రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ ఓట్లన్నీ బదిలీ అవుతాయి. ఉదాహరణకు టెక్సాస్‌లో 38 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మంగళవారం నాటి ఎన్నికల్లో రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలు చెరిసగం ఎలక్టోరేట్లను గెలుచుకున్నాయి అనుకుందాం. అయితే, మొత్తం ఓట్లలో రిపబ్లికన్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే ఈ 38 ఎలక్టోరల్‌ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి ట్రంప్‌  ఖాతాలోకి వెళ్లిపోతాయి. దీనినే పాపులర్‌ ఓట్‌ అంటారు. 

2016 అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాటి డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ పాపులర్‌ ఓటు విధానం వల్ల ట్రంప్‌కు ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు రావటంతో ఆయన అధ్యక్షుడు అయ్యారు. 

కేవలం మెయినె, నెబ్రాస్కా రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో లేదు. పాపులర్‌ ఓట్లతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రాల ఎలక్టోరల్స్‌  ఓట్లను తమ పార్టీ అభ్యర్థులకు వేసుకోవచ్చు.  

దేశం మొత్తంలో డెమోక్రటిక్‌ పార్టీకి 203, రిపబ్లికన్లకు 125 ఎలక్టోరల్‌ ఓట్ల మద్దతు సంప్రదాయకంగా కొనసాగుతూ వస్తున్నది. మిగిలిన 210 స్థానాల్లో మెజారిటీ ఓట్లు గెలుచుకొనేందుకే అభ్యర్థులు కష్టపడుతుంటారు. 

లక్ష కోట్ల ఖర్చు

ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఎన్నికల నిర్వహణతోపాటు అభ్యర్థులు, పార్టీల ప్రచార ఖర్చును కూడా కలుపుకుంటే 14 బిలియన్‌ డాలర్ల (రూ.104,237 కోట్లు) వ్యయం అవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. 

అభ్యర్థుల గెలుపులో కీలకం కానున్న..  ఆర్థికం, వలసలు, కరోనా అంశాలు

ట్రంప్‌, బిడెన్‌ పరస్పర భిన్న వైఖరి

వాషింగ్టన్‌: అమెరికన్‌ ఓటర్లను  ప్రభావితం చేసే ఆర్థికం, వాణిజ్యం, వలస విధానాల పట్ల ట్రంప్‌, బిడెన్‌ దృక్కోణం భిన్నంగా ఉన్నది. భారత్‌, కరోనా సంక్షోభం వంటి కీలక అంశాల్లో కూడా ఇరువురి వ్యవహార శైలి ఇదేమాదిరిగా ఉండటంతో అమెరికన్‌ పౌరులు, ఇండో-అమెరికన్లు ఎవరివైపునకు మొగ్గు చూపుతారో ఆసక్తిగా మారింది. 

ఆర్థిక వ్యవస్థ 

ట్రంప్‌: కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థను తెరువాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. 2017లో ట్యాక్స్‌ కట్స్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. 

బిడెన్‌: కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుండా ఆర్థిక వ్యవస్థను తెరువడాన్ని ఆక్షేపించారు. ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీతో తయారీ, సేవల రంగంలో కొత్త కొలువులను తీసుకువస్తానన్నారు.   

వాణిజ్యం

ట్రంప్‌: ‘అమెరికా ఫస్ట్‌' విధానంలో భాగంగా భారత్‌ తదితర దేశాలపై భారీగా సుంకాన్ని విధించారు. మెక్సికో, కెనడా, చైనా (తొలి దశ)తో కీలక వాణిజ్య ఒప్పందాల్ని చేసుకున్నారు. 

బిడెన్‌: ‘మేడిన్‌ అమెరికా’ ఉత్పత్తులు, పరిశోధనల కోసం 70వేల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తానన్నారు. చైనా వాణిజ్య సంబంధాలపై మిత్ర దేశాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. 

కరోనా

ట్రంప్‌: వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ, ఆంక్షలు ఎత్తివేయాలని రాష్ర్టాల గవర్నర్లపై ఒత్తిడి తెచ్చారు. ముఖానికి మాస్కు ధరించడాన్ని ఇష్టపడలేదు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉచిత సరఫరాకు వెయ్యి కోట్ల డాలర్లను కేటాయిస్తానని ప్రకటించారు.

బిడెన్‌: కరోనా కట్టడిలో ట్రంప్‌ విఫలమయ్యారన్నారు. వైరస్‌ సోకకుండా మాస్కులు ధరించాలన్నారు. ఉచిత వ్యాక్సిన్‌ సరఫరాకు 2,500 కోట్ల డాలర్లను కేటాయిస్తానని ప్రకటించారు.

వలస విధానం

ట్రంప్‌: విదేశీ వలసలపై ఉక్కుపాదం మోపారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఏడు దేశాల నుంచి వచ్చే వలసదారులపై ఆంక్షలు విధించారు. మెక్సికో నుంచి వలసలను తగ్గించడానికి సరిహద్దుల్లో గోడను నిర్మిస్తున్నారు. 

బిడెన్‌: వలస విధానానికి సానుకూలంగా ఉన్నారు. వలసదారుల వల్లనే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందన్నారు. మెక్సికో గోడ నిర్మాణానికి నిధుల్ని నిలిపేస్తామన్నారు. 

భారత్‌ 

ట్రంప్‌: హౌడీ-మోదీ, నమస్తే ట్రంప్‌ వంటి సభల్లో ప్రధాని మోదీతో సన్నిహిత మిత్రుడిగా మెదిలిన ట్రంప్‌ మరోవైపు, వీలుచిక్కినప్పుడల్లా భారత్‌ మీద అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. భారత్‌ను ‘టారిఫ్‌ కింగ్‌'గా అభివర్ణిస్తూ, స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై విపరీతమైన సుంకాన్ని విధించారు. హెచ్‌-1బీ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధాన్ని విధించారు. భారత్‌ అడగకుండానే కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం చేస్తానని తరుచూ చెప్పారు. ఈ ఆఫర్‌ను భారత్‌ తిరస్కరించింది. అయితే చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

బిడెన్‌: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు పాల్పడుతున్న చైనాకు బుద్ధి చెబుతామని, ఈ విషయంలో భారత్‌ పక్షానే ఉంటామని చెబుతున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని సహించేదిలేదన్నారు. హెచ్‌1-బీ వీసాల జారీపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తామన్నారు. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించి భారత్‌, అమెరికాలో ఉన్న మధ్య తరగతి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.