ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 02:04:26

మాస్కే పెట్టనన్నాడు.. కరోనా బారిన పడ్డాడు

మాస్కే పెట్టనన్నాడు.. కరోనా బారిన పడ్డాడు

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా 
  • ఆయన భార్య మెలానియాకు కూడా.. 
  • మరో నెలలో అధ్యక్ష ఎన్నికలు 
  • ట్రంప్‌ విజయావకాశాలపై తీవ్రప్రభావం 
  • బిడెన్‌ దంపతులకు కరోనా నెగెటివ్‌ 

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 2: ‘బిడెన్‌లా నేను మాస్క్‌ ధరించను. ఆయనను ఎప్పుడైనా చూడండి.. మాస్క్‌ వేసుకునే కనిపిస్తారు’ అంటూ డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ను ఎగతాళి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (74) స్వయంగా కరోనా బారినపడ్డారు. ట్రంప్‌తోపాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అధ్యక్షుడి ముఖ్య సలహాదారుల్లో ఒకరైన హోప్‌ హిక్స్‌కు కరోనా సోకటంతో ఆమె నుంచి ట్రంప్‌ దంపతులకు వైరస్‌ వ్యాపించినట్టు సమాచారం. ట్రంప్‌, మెలానియా అధ్యక్ష భవనం వైట్‌హౌన్‌లోనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఏ అంతరాయం లేకుండా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. ఒకవేళ ఆయన విధులు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తితే.. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా, ట్రంప్‌ ప్రత్యర్థి జో బిడెన్‌కు, ఆయన భార్యకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరికీ నెగెటివ్‌ వచ్చింది. 

ఫలించని ట్రంప్‌ వ్యూహం 

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్‌ కరోనా బారిన పడడం.. రిపబ్లికన్‌ పార్టీ ప్రచారంపైనే కాకుండా, ట్రంప్‌ విజయావకాశాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ట్రంప్‌ విఫలమయ్యారన్న అభిప్రాయం ఇప్పటికే అమెరికన్లలో బలంగా ఉంది. ఇప్పుడు ఆయనే స్వయంగా కరోనా బారిన పడడం ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ట్రంప్‌కు కరోనా అని వార్తలు వెలువడిన వెంటనే ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్రంగా నష్టపోయాయి. ట్రంప్‌ దంపతులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

కరోనా ప్రముఖుల క్లబ్‌లో ట్రంప్‌ 

కరోనా బారిన పడిన దేశాధినేతల జాబితాలో అమెరికా అధ్యక్షుడు కూడా చేరిపోయారు. తొలుత బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆ తర్వాత బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సోనారో వ్యాధి బారిన పడి కోలుకున్నారు. హోండురస్‌ అధ్యక్షుడు జాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌, గ్వాటెమాలా అధ్యక్షుడు అలెజాండ్రో గీమెట్రీ, బొలీవియా అధ్యక్షుడు జీనైన్‌ అనెజ్‌, డొమెనిక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు లూయిస్‌ కూడా వైరస్‌ బారిన పడ్డారు.


logo