సోమవారం 06 జూలై 2020
International - May 28, 2020 , 14:23:33

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించే అగ్రరాజ్యం అమెరికా కరోనాతో వణికిపోతున్నది. దేశంలోకి  వైరస్‌ అడుగుపెట్టిన నాలుగు నెలల్లోనే లక్ష మంది మరణించారు. కరోనా ఇలానే విజృంభిస్తే అధ్యక్షుడు ట్రంప్‌ అంచనా చెప్పినట్లు మృతుల సంఖ్య రెండు లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదు. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 1,00,396 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా మరణాల్లో 30 శాతం అమెరికాలో ఉండటం గమనార్హం. అమెరికాలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు ఈ ఏడాది జనవరి 21న  వాషింగ్టన్‌లో నమోదయ్యింది. దేశంలో గత 24 గంటల్లో 1,401 మంది ఈ వైరస్‌ ప్రభావంతో మరణించారు.   

దేశంలో ప్రస్తుతం 17,45,803 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇందులో 11,53,566 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 17,166 మంది క్రిటికల్‌ కండిషన్‌లో ఉన్నారు. మరో 4,90,130 మంది కోలుకున్నారు.

దేశంలో అత్యధికంగా న్యూయార్క్‌లో మొత్తం 3,74,672 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 29,553 మంది బాధితులు మరణించారు. న్యూయార్క్‌ తర్వాత కరోనా కేసులు, మృతుల సంఖ్యలో న్యూజెర్సీ రెండో స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో 1,57,818 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 11,341 మంది మృతిచెందారు. ఇల్లినాయిస్‌లో ఇప్పటివరకు 1,14,306 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 5083 మంది మృతిచెందారు.       

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 58,03,647 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 3,57,712 మంది మరణించారు. 29,37,004 యాక్టివ్‌ కేసులు ఉండగా, 25,08,931 మంది కోలుకున్నారు. 


logo