బుధవారం 03 మార్చి 2021
International - Feb 22, 2021 , 12:38:59

అమెరికాలో 5 ల‌క్ష‌ల‌కు చేరువైన‌ క‌రోనా మ‌ర‌ణాలు

అమెరికాలో 5 ల‌క్ష‌ల‌కు చేరువైన‌ క‌రోనా మ‌ర‌ణాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి పెను విషాదాన్నే మిగిల్చింది. ఆ దేశంలో క‌రోనా మరణాల సంఖ్య దాదాపు ఐదు లక్షలకు చేరువలోకి వ‌చ్చింది. ఆదివారం రాత్రివ‌ర‌కు అక్క‌డ మొత్తం 4.98 లక్షల కొవిడ్ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ నివేదికలు ఈ వివ‌రాల‌ను వెల్లడించాయి. కాగా, దాదాపు 102 ఏండ్ల క్రితం ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్‌ సృష్టించిన విలయం తర్వాత అగ్ర‌రాజ్యంలో అంతటి భారీ సంక్షోభం ఇదేనని ఆ దేశ ఆరోగ్య నిపుణుడు ఆంటోనీ ఫౌసీ తెలిపారు.

కాగా, అమెరికాలో గతేడాది ఫిబ్రవరిలో తొలి కరోనా మరణం న‌మోదైంది. అప్ప‌టి నుంచి తొలి నాలుగు నెల‌ల్లో అంటే మే నెల చివ‌రిక‌ల్లా అమెరికాలో క‌రోనా మృతుల సంఖ్య లక్ష మార్కును దాటింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో 2 లక్షల మార్క‌ను, డిసెంబర్‌లో 3 లక్షల మార్కును అమెరికా క‌రోనా మ‌ర‌ణాలు అధిగ‌మించాయి. అనంత‌రం ఈ ఏడాది జనవరి 19న ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే స‌మ‌యానికి ఆ దేశంలో క‌రోనా చావులు 4 లక్షలు దాటాయి. ఫిబ్ర‌వ‌రి 21 నాటికి 4.98 ల‌క్ష‌ల క‌రోనా మ‌ర‌ణాలు రికార్డ‌య్యాయి. 

అమెరికాలో క‌రోనా మృతుల సంఖ్య 5 లక్షలకు కేవ‌లం రెండు వేల దూరంలో ఉన్న క్ర‌మంలో సోమ‌వారం శ్వేత సౌధంలో అధ్యక్షుడు బైడెన్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ మృతులకు నివాళులు అర్పించ‌బోతున్నారు. మృతుల ఆత్మ‌శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించనున్న‌ట్లు వైట్‌హౌస్ ప్ర‌క‌టన చేసింది. కాగా, అమెరికాలో ఇప్పటివరకు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన వారి సంఖ్య 2.80 కోట్లకు చేరగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 25 ల‌క్ష‌లు దాటింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo