బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 09, 2020 , 16:32:40

అమెరికా క‌కావిక‌లం.. ఒకే రోజు 60 వేల కేసులు

అమెరికా క‌కావిక‌లం.. ఒకే రోజు 60 వేల కేసులు

వాషింగ్ట‌న్ డీసీ : క‌రోనా మ‌హ‌మ్మారి అగ్ర రాజ్యం అమెరికాను క‌కావిక‌లం చేస్తోంది. క‌రోనా విల‌య‌తాండ‌వానికి అగ్ర‌రాజ్యం అత‌లాకుత‌లమ‌వుతోంది. కొవిడ్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా.. జీవ‌నోపాధికి భంగం వాటిల్లుతోంది. 

అమెరికాలో బుధ‌వారం ఒక్క‌రోజే 60 వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఫ్లోరిడాలో 10 వేలు, టెక్సాస్ లో 9,500, కాలిఫోర్నియాలో 8,500ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాలిఫోర్నియా, టెక్సాస్ లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా అత్య‌ధికంగా సంభ‌వించాయి. బుధ‌వారం ఒకే రోజు 900ల‌కు పైగా క‌రోనాతో మృతి చెందారు. 

టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, ఉత్హాలో ప్ర‌తి రోజు కొవిడ్ పాజిటివ్ కేసులు అధికంగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త రెండు వారాల నుంచి 42 దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.  

గ‌త శుక్ర‌వారం యూఎస్ లో 56,818 కేసులు న‌మోద‌య్యాయి. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ కేసులు 3 మిలియ‌న్ల‌కు పైగా న‌మోదు అయ్యాయి. 1,32,000 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు 12 మిలియ‌న్ల‌కు పైగా న‌మోదు కాగా, 5,46,000 మంది మ‌ర‌ణించారు.


logo