శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 13, 2020 , 21:32:45

చైనాలో కరోనా మూలాలు నిగ్గుతేల్చనున్న డబ్ల్యూహెచ్‌ఓ

చైనాలో కరోనా మూలాలు నిగ్గుతేల్చనున్న డబ్ల్యూహెచ్‌ఓ

బీజింగ్ : కరోనా వైరస్ మూలాన్ని తెలుసుకునే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిమగ్నమైంది. డబ్ల్యూహెచ్‌ఓ కు చెందిన ఇద్దరు నిపుణులు చైనాలో పర్యటిస్తున్నారు. ఈ విషయన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ధృవీకరించింది. కరోనాను ట్రేసింగ్ చేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓతో చైనా ఏకాభిప్రాయానికి వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునింగ్ సోమవారం బ్రీఫింగ్ లో మీడియాకు వెల్లడించారు.

వైరస్ యొక్క మూలాన్ని గుర్తించడం చాలా ముఖ్యం అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అడ్నోమ్ ఘెబ్రేస్ గత నెలలో చెప్పారు. కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. 2019 డిసెంబర్‌లో వైరస్ బయటపడిన చైనాలోని వుహాన్ మార్కెట్‌లో ఇది జరిగిందని తెలుస్తోంది. ఇటీవల, హాంకాంగ్‌ను వదిలి అమెరికా చేరుకున్న వైరసిస్ట్ లి-మెంగ్ యాన్.. కరోనా వైరస్‌పై చైనా అబద్ధాలను బయటి ప్రపంచానికి వెల్లడించారు. ఈ వైరస్ గురించి చైనా ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో దాచిపెట్టిందని ఆయన చెప్పారు. హాంకాంగ్ పరిశోధకులతో పాటు విదేశీ నిపుణులను సొంతంగా పరిశోధన చేయడానికి చైనా ప్రభుత్వం అనుమతించలేదని లి-మెంగ్ యాన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెట్టిందని ఆరోపించారు. చైనాకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యత తీసుకోలేదని తీవ్రంగా విమర్శించి చివరకు డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు వచ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా చైనా ఇమేజ్‌ను కరోనా తీవ్రంగా ప్రభావితం చేసింది.

డబ్ల్యూహెచ్ఓ కు చెందిన ఇద్దరు నిపుణులు చైనా ప్రభుత్వ అనుమతితో చైనాకు వచ్చి వైరస్ ట్రేసింగ్ పనిపై చైనా నిపుణులతో చర్చలు ప్రారంభించారు. వీరు చైనాలోని వుహాన్ తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి కరోనా వైరస్ మూలాలపై పరిశోధనలు చేస్తారు. వీరు ఇతర దేశాల్లో కూడా పర్యటించి పరిశోధనలు జరుపుతారని సమాచారం.


logo