బుధవారం 03 జూన్ 2020
International - Apr 23, 2020 , 12:01:09

న్యూయార్క్‌లో పిల్లులకు కరోనా

న్యూయార్క్‌లో పిల్లులకు కరోనా

వాషింగ్టన్‌ : న్యూయార్క్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. న్యూయార్క్‌లో కరోనాతో 20,354 మంది మృతి చెందారు. 2,62,268 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అక్కడ రెండు పిల్లులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ పిల్లులను క్వారంటైన్‌లో ఉంచారు. పిల్లులకు ఇతర వ్యక్తుల నుంచే కరోనా సోకినట్లు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ నిర్ధారించింది. ఈ రెండు పిల్లులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి.

మొదటి పిల్లి యజమానికి కరోనా వైరస్‌ సోకలేదు. పిల్లి బయటకు వెళ్లిన సమయంలో కరోనా సోకిన వ్యక్తి నుంచి ఆ పిల్లికి కరోనా సోకి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో పిల్లి బాధపడుతుండటంతో దానికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఇక రెండో పిల్లి విషయానికి వస్తే దాని యజమానికి కరోనా పాజిటివ్‌ ఉండటంతో ఆయన ద్వారా వ్యాప్తి చెందింది. అదే ఇంట్లో ఉన్న మరో పిల్లికి కరోనా సోకలేదు. అయితే కరోనా వైరస్‌ మనషుల నుంచి జంతువులకే సోకడం చూశాం. కానీ జంతువుల నుంచి మనషులకు కరోనా సోకినట్లు ఆధారాలు లేవని యూఎస్‌ వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాప్తి చెందిచడంలో జంతువుల పాత్ర ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు. 


logo