బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 01, 2020 , 14:32:59

కత్తిపోట్లకు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

కత్తిపోట్లకు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

టొరంటో: కత్తిపోట్లకు ఇద్దరు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. కెనడాలోని క్యూబెక్‌ ప్రావిన్స్‌లో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. నగరంలోని ర్యూడెస్ రాంపార్ట్స్‌లోని చాటే ఫ్రాంటెనాక్ సమీపంలో 20 ఏండ్ల వయసున్న ఒక వ్యక్తి కనిపించిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మరోవైపు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, తలుపులు వేసుకోవాలని పోలీసులు సూచించారు. పార్లమెంట్‌ హిల్‌ ప్రాంతం వైపు ఎవరూ రావద్దని హెచ్చరించారు. కత్తిపోట్ల గురించి దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు.

కెనడాలోని క్యూబెక్‌ నగరంలో ఫ్రెంచ్‌ మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు. ఫ్రాన్స్‌లో ఇటీవల ఇస్లామిక్ రాడికల్స్ దాడులను కొందరు క్యూబెక్‌ నగర వాసులు ఖండించారు. ఫ్రాన్స్‌కు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ కత్తిపోట్ల దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.