శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 03:36:21

మనసున్న శ్రీమంతులు

మనసున్న శ్రీమంతులు

  • మాపై భారీగా పన్నులు విధించండి
  • వాటిని కరోనా పోరుకు వాడండి
  • తమ ప్రభుత్వాలకు  80 మందికిపైగా ప్రపంచ మిలియనీర్ల లేఖ

లండన్‌: కరోనా పిడికిల్లో చిక్కి యావత్‌ ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రస్తుత తరుణంలో.. మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా 80 మందికిపైగా ‘శ్రీమంతులు’ ముందుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాతృత్వం ఒక్కటే సమస్యను పరిష్కరించలేదని.. వైరస్‌ కట్టడికి అవసరమయ్యే నిధుల కోసం తమపై ‘పెద్ద ఎత్తున పన్ను’ విధించాలని స్వయంగా వారే ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాశారు. తద్వారా మనీ కంటే మానవత్వమే గొప్పదని చాటారు. ‘ఐసీయూలోని రోగుల బాగోగులను చూస్తున్నది మేము కాదు. అనారోగ్యం పాలైన వారిని దవాఖానలకు చేర్చే అంబులెన్స్‌లను మేం నడుపడం లేదు. ఇంటింటికీ ఆహారాన్ని డెలివరీ చేస్తున్నదీ మేము కాదు.. కానీ మావద్ద డబ్బుంది. చాలా ఉంది. ఇప్పుడు డబ్బు అత్యవసరం. వచ్చే కొన్నేండ్లలోనూ దీని అవసరం చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలో మాలాంటి వారిపై పన్నులు పెంచాల్సిందిగా ప్రభుత్వాలను కోరుతున్నాం. తక్షణంగా. గణనీయంగా. శాశ్వతంగా’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన మిలియనీర్లే ఎక్కువగా ఉన్నారు. అబిగైల్‌ డిస్నీ, టిమ్‌ డిస్నీ, మేరీ ఫోర్డ్‌ కూడా వారిలో ఉన్నారు.

వారికి రుణపడి ఉన్నాం..

 ‘ఈ సంక్షోభం ప్రభావం దశాబ్దాలపాటు కొనసాగనున్నది. దీని వల్ల 50 కోట్లమందికిపైగా ప్రజలు దారిద్య్రంలోకి జారుకునే ప్రమాదమున్నది. లక్షలమంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే దాదాపు 100 కోట్లమంది పిల్లలు బడికి దూరమయ్యారు. దవాఖానల్లో బెడ్‌లు, మాస్క్‌లు, వెంటిలేటర్లకు కొరత ఉండడం విచారకరం. ఇది ప్రజావైద్య వ్యవస్థల్లో తగినన్ని పెట్టుబడులు పెట్టకపోవడాన్ని గుర్తుచేస్తున్నది’ అని వారు లేఖలో పేర్కొన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వారికి రుణపడి ఉన్నామని చెప్పారు. ‘ఆలస్యం కాకమునుపే మన ప్రపంచాన్ని మళ్లీ సమతుల్యం చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని సరిచేసేందుకు మరో అవకాశం రాదు. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజల్లాగా.. మా ఉద్యోగం, ఉపాధి, కుటుంబాన్ని పోషించే ఆదరవు కోల్పోతామనే బెంగ మాకు లేదు. ఈ ఎమర్జెన్సీ సమయంలో మేం ముందుండి పోరాడడం లేదు. మేం బాధితులయ్యే అవకాశాలు  తక్కువ’ అని మిలియనీర్లు పేర్కొన్నారు. కాబట్టి తమపై అత్యధిక పన్నులు విధించి నిధులు సేకరించాలని లేఖలో కోరారు. 



logo