బుధవారం 08 జూలై 2020
International - May 28, 2020 , 01:25:22

ట్రంప్‌ ట్వీట్లకు తొలిసారి ‘ఫ్యాక్ట్‌ చెక్‌'!

ట్రంప్‌ ట్వీట్లకు తొలిసారి ‘ఫ్యాక్ట్‌ చెక్‌'!

  • ట్విట్టర్‌ నిర్ణయం.. మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లకు మొట్టమొదటిసారి ట్విట్టర్‌ ‘ఫ్యాక్ట్‌ చెక్‌' లేబుల్‌ను ఉంచింది. ఎన్నికల్లో ‘మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌' విధానాన్ని అవలంబించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతాయని ఆరోపిస్తూ ట్రంప్‌ చేసిన రెండు ట్వీట్లకు ఈ మేరకు ‘ఫ్యాక్ట్‌ చెక్‌' ముద్రను జతచేసింది. తద్వారా ట్రంప్‌ ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకోవాలని నెటిజన్లకు సూచించింది. తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు ట్విట్టర్‌ ఇటీవలే ఫ్యాక్ట్‌ చెక్‌ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ట్రంప్‌ ట్వీట్లకు దీన్ని వాడడం ఇదే తొలిసారి. నవంబర్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ‘మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌' విధానాన్ని వాడాలని కాలిఫోర్నియా గవర్నర్‌ నిర్ణయించారు. అయితే ట్రంప్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌ మోసపూరితం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిల్‌ బాక్స్‌లను దొంగిలించొచ్చు. బ్యాలెట్లను ఫోర్జరీ చేయొచ్చు. అంతేకాదు వీటిని అక్రమంగా ముద్రించొచ్చు. మోసపూరితంగా సంతకాలు చేయొచ్చు. కాలిఫోర్నియా గవర్నర్‌ లక్షల మందికి మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌ పంపుతున్నారు’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దీనికి ట్విట్టర్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ లేబుల్‌ను జతచేయడంతో ఆయన ట్విట్టర్‌పై మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్‌ జోక్యం చేసుకుంటున్నదని ఆరోపించారు. ‘పెద్ద ఎత్తున మోసానికి దారితీసే మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్స్‌పై నేను చేసిన వ్యాఖ్యలను.. ఫేక్‌ న్యూస్‌ సీఎన్‌ఎన్‌, అమెజాన్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ఆధారంగా అవాస్తమని వారు చెబుతున్నారు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ట్విట్టర్‌ హరిస్తున్నదని ధ్వజమెత్తారు. 


logo