మంగళవారం 26 జనవరి 2021
International - Jan 12, 2021 , 09:20:12

ట్రంప్‌కు ట్విట్టర్‌ మరో షాక్‌.. 70వేల మద్దతుదారుల అకౌంట్ల తొలగింపు

ట్రంప్‌కు ట్విట్టర్‌ మరో షాక్‌.. 70వేల మద్దతుదారుల అకౌంట్ల తొలగింపు

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విషయంలో మరోసారి సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ సంచలనం నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ మద్దతుదారులకు చెందిన సుమారు 70వేల అకౌంట్లను నిలిపివేస్తూ షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే ట్రంప్‌ అధికారిక ఖాతాను శాశ్వాతంగా నిషేధించిన విషయం తెలిసిందే. గతవారం అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్‌ క్యాపిటల్‌లో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైంది. అడ్డుకునేందుకు క్యాపిటల్‌ భవనంలోకి ట్రంప్‌ మద్దతుదారులు చొచ్చుకు రావడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా భవనం వెలుపల, బయట జరిగిన అల్లర్లలో నలుగురు సాధారణ పౌరులతో సహా ఓ పోలీస్‌ అధికారి మృతి చెందాడు. సమావేశానికి ముందు ట్రంప్‌ తన మద్దతుదారులనుద్దేశించి వరుస ట్వీట్లు చేశారు. అవి ‘హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్లు’ ప్రకటించింది.

వాషింగ్టన్‌, డీసీలో హింసాత్మక సంఘటనలు కొనసాగే ప్రమాదం ఉన్నందున క్యాపిటల్‌ ఘటనకు సంబంధించిన కంటెంట్‌ను షేర్‌ చేస్తున్న వేలాది ఖాతాలను శుక్రవారం నుంచి శాశ్వతంగా నిలివేస్తున్నట్లు ట్విట్టర్‌ సోమవారం ఆలస్యంగా తన బ్లాగ్‌లో తెలిపింది. ప్రధానంగా కుట్ర సిద్ధాంతాన్ని, ఎన్నికల ఫలితాలపై ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని పంచుకునేందుకు అకౌంట్లన్నీ అంకితమయ్యాయని చెప్పింది. నిశిత పరిశీలన అనంతరం 70వేల ఖాతాలను నిలిపివేసినట్లు చెప్పింది. అలాగే ట్రంప్‌ అనుకూల పోస్టులపై ఫేస్‌బుక్‌ సంస్థ చర్యలు చేపట్టింది. ఫేస్‌బుక్‌లో ‘ఆమోదాన్ని ఆపండి’ అని ట్రంప్‌ మద్దతుదారులు పోస్టులు పెట్టారు. ‘ఆమోదాన్ని ఆపండి’ అని పదం ఉన్న పోస్టులను ఫేస్‌బుక్‌ సంస్థ తొలగించింది. తమ నిబంధనలు ఉల్లంఘించే ఎలాంటి పోస్టులను తొలగిస్తామని, హింసను ప్రేరేపించే తప్పుడు సమాచార వ్యాప్తిని ఆపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.


logo