సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 15:48:47

వీరు కవలలు.. జన్మదినం నాడే బిడ్డలకు జన్మనిచ్చారు

వీరు కవలలు.. జన్మదినం నాడే బిడ్డలకు జన్మనిచ్చారు

మనం ఏదేదో అనుకుంటుంటాం.. ఏవేవో కోరుకుంటుంటాం.. అయితే, అవన్నీ నిజం కావు. అనుకున్నవన్నీ జరుగవు. ఈ విషయాలన్నీ తెలిసినా మానవమాతృలమైన మనం అలా జరిగితే బాగుండు అని ఆశిస్తుంటాం. అయితే, కొన్ని మాత్రం అనుకోకుండా జరుగుతాయి. అలాంటి అనుకోని సంఘటన ఒకటి.. ఆ కవలకు చిరస్మరణీయమైంది. 

టేనస్సీలోని నాక్స్ విల్లెకు చెందిన ఆటమన్‌ షా, అంబర్ ట్రామోంటానాలు కవలలు. చిన్నతనం నుంచి వారు కలిసే చాలా పనులు చేసారు. వారి ప్రవర్తన, వ్యక్తిత్వంలో చాలా సారూప్యతలను పంచుకుంటున్నారు. అనుకోకుండా వీరి పెండ్లిళ్లు ఒకేరోజున జరుగడం.. ఆశ్చర్యకరంగా ఇద్దరూ ఒకేరోజు గర్భం దాల్చారు. ఒకేరోజు బిడ్డల్ని కూడా కంటే బాగుంటుందని భావించారు. వారు అనుకున్నట్లుగానే గత నెల 29న గంట వ్యవధిలో ఇద్దరూ పండంటి బిడ్డలకు ఒకే దవాఖానలో జన్మనిచ్చారు. బిడ్డలకు జన్మనిచ్చిన రోజునే ఈ కవలల జన్మదినం కావడం మరో విశేషం. మేం పెరిగిన వాతావరణం, మా వ్యక్తిత్వ సారూప్యతల మాదిరిగానే మా పిల్లల్ని కూడా పెంచాలని భావిస్తున్నట్లు అంబర్‌ ట్రామోంటానా చెప్పారు. మేం కవలలుగా పుట్టి నర్సింగ్‌ కోర్సు వరకు ఇద్దరం కలిసి చదువుకున్నామని ఆమె తెలిపారు. గత జూలై నెలలో ఒహియోకు చెందిన ముగ్గురు సోదరీమణులు ఒహియో హెల్త్ మాన్స్ఫీల్డ్ దవాఖానలో దనీషా హేన్స్, ఏరియల్ విలియమ్స్, ఆష్లే హేన్స్.. తమ బిడ్డలకు జన్మనిచ్చారు. నాలుగున్నర గంటల వ్యవధిలో వీరి కాన్పులు జరిగాయి. ఒకే రోజున ఒకే దవాఖానలో ముగ్గురు సోదరీమణులు ప్రసవించి కొత్త రికార్డును నెలకొల్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.