సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 31, 2020 , 12:02:34

ఏజియ‌న్ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువే !

ఏజియ‌న్ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువే !

హైద‌రాబాద్‌:  ఏజియ‌న్ స‌ముద్రంలో భూకంపాలు సాధార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.  గ్రీసు, ట‌ర్కీ మ‌ధ్య ఉన్న ఈ స‌ముద్రంలో అప్పుడ‌ప్పుడు భూకంపాలు సంభ‌విస్తూనే ఉంటాయి.  ఈ ప్రాంతంలో ఉన్న సముద్ర తీరం, భూమి, అక్క‌డ భూఫ‌ల‌కాల్లో లోపాలు ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు.  ఇక్క‌డ ఏదైనా భూకంపం వ‌స్తే, ఇక ఆ త‌ర్వాత భారీ స్థాయిలో భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అవుతుంటాయి.  ఆఫ్ట‌ర్‌షాక్స్‌తో పాటు చిన్న చిన్న భూకంపాలు రికార్డు అవుతుంటాయ‌ని పేర్కొంటున్నారు. భూ ఫ‌ల‌కాల్లో ఉన్న లోపాల వ‌ల్ల చాలా సేపు ప్ర‌కంప‌న‌లు వ‌స్తుంటాయ‌ని, అయితే వాటి తీవ్ర‌త మెల్ల‌మెల్లగా త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  

ప్ర‌పంచంలో అత్య‌ధిక భూకంప ప్ర‌భావిత ప్రాంతంలో ట‌ర్కీ ఉన్న‌ట్లు నిపుణులు వెల్ల‌డించారు.  ఈ ప్రాంతంలో ఉన్న నేల‌ల్లో ఫాల్ట్ లైన్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు.  నార్త‌ర్న్ అన‌టోలియా ఫాల్ట్‌(ఎన్ఏఎఫ్‌) ఫ‌ల‌కాలు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తుంటారు. అన‌టోలియ‌న్‌, యురేసియ‌న్ టెక్టానిక్ ప్లేట్స్ ఇక్క‌డే సంగ‌మిస్తాయి.  అయితే ఈ ప్రాంతంలో గ‌తంలో అనేక సార్లు భీక‌ర‌మైన భూకంపాలు సంభ‌వించాయి.  1999లో అత్య‌ధికంగా 7.4 తీవ్ర‌త‌తో భూకంపం న‌మోదు అయ్యింది. ఆ భూకంపం వ‌ల్ల సుమారు 17వేల మంది మ‌ర‌ణించారు.  ఇక ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనూ 6.7 తీవ్ర‌త‌తో భూ కంపం వ‌చ్చింది.  దాని వ‌ల్ల 50 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. శుక్ర‌వారం సంభవించిన భూకంపం వ‌ల్ల ట‌ర్కీ, గ్రీస్ దేశాల్లో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది.