సోమవారం 18 జనవరి 2021
International - Jan 10, 2021 , 18:28:55

శృంగారం కోసం.. ప్రియురాలి ఇంటి వరకు సొరంగం

శృంగారం కోసం.. ప్రియురాలి ఇంటి వరకు సొరంగం

మెక్సికో సిటీ: ప్రియురాలితో శృంగారం కోసం ఒక వ్యక్తి ఏకంగా తన ఇంటి నుంచి పొరుగున ఉన్న ఆమె ఇంటి వరకు సొరంగాన్ని నిర్మించాడు. చివరకు ప్రియురాలి భర్త వీరిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆ టన్నెల్‌ గుట్టు కూడా రట్టయ్యింది. మెక్సికోకు చెందిన అల్బెర్టో అనే వ్యక్తి విల్లాస్ డెల్ ప్రాడోలోని టిజువానాలో నివాసం ఉంటున్నాడు. పొరుగున ఉన్న పెండ్లి అయిన మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ మధ్య ఉన్న సంబంధం గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తన ఇంటి నుంచి పొరుగున ఉన్న ప్రియురాలి ఇంటి వరకు సొరంగాన్ని అల్బెర్టో తవ్వాడు. ఆ మహిళ భర్త జార్జ్‌ ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లగానే ఆ సొరంగం గుండా ఆమె ఇంటికి వెళ్లి కలుసుకునేవాడు. 

అయితే ఒక రోజు ఆ మహిళ భర్త జార్జ్‌ త్వరగా ఇంటికి రావడంతో వీరిద్దరు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. సోఫా వెనుక దాక్కున్న అల్బెర్టోను జార్జ్‌ పట్టుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సొరంగాన్ని కూడా గుర్తించాడు. దాని గుండా వెళ్లగా అతడి ఇంటి లోపలికి అది దారి తీసింది. మరోవైపు వివాహితుడైన అల్బెర్టో తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని జార్జ్‌ను ప్రాధేయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘర్షణకు దిగిన వారిద్దరు కొట్టుకున్నారు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన పోలీసులు వారిద్దరిని విడదీశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.