శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 17, 2020 , 16:12:19

ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ బట్టబయలు!

ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ బట్టబయలు!

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ట్విట్టర్ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ను సైబర్ నేరగాళ్లు బయటపెట్టారు. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి మరీ ఆయన పాస్‌వర్డ్‌ను ప్రపంచానికి చాటిచెప్పారు. ట్విట్టర్‌ పోస్టుల్లో మార్పులు చేర్పులు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో.. అంటే గత అక్టోబర్ 16వ తేదీన ఈ ఘటన చోటుచేసున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇటీవలనే హ్యాకర్‌ను అమెరికా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులు సదరు హ్యాకర్‌ నెదర్లాండ్ పౌరుడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నెదర్లాండ్స్‌ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. సదరు హ్యాకర్‌ ఎథికల్‌ హ్యాకర్‌ కావడంతో ఎలాంటి చర్యలు ఉండవని తెలుస్తున్నది.

విక్టర్ గెవెర్స్ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లోకి చొరబడి అకౌంట్ సెక్యూరిటీ సిస్టమ్‌ను బ్రేక్ చేశాడు. అకౌంట్‌ను తన ఆధీనంలోకి తీసుకుని ఆ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ను గుర్తించాడు. 'maga2020!' అనే పదాన్ని ట్రంప్ అప్పట్లో తన ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌గా వినియోగించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్... ఈ నినాదాన్ని రిపబ్లిక్‌ పార్టీ తన ప్రచారానికి వాడుకున్నది. దీనిలోని ఒక్కో పదానికి చెందిన తొలి అక్షరాన్ని తీసుకుని.. 'maga2020' ని.. ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌గా వినియోగించారు. అప్పట్లో ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు వార్తలు వచ్చినప్పటికీ.. వైట్‌హౌస్ దాన్ని తోసిపుచ్చింది. అకౌంట్ హ్యాక్ కాలేదని, సాంకేతిక ఇబ్బందులు ఏర్పడినట్లు వివరణ కూడా ఇచ్చింది. తాజాగా విక్టర్ గెవెర్స్‌ను నెదర్లాండ్ ప్రభుత్వం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టింది. విచారణ సందర్భంగా ఆయనను ఎథికల్ హ్యాకర్‌గా గుర్తించింది. ఎథికల్‌ హ్యాకర్‌లపై నెదర్లాండ్స్‌ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవడంగానీ, జరిమానా విధించడంగానీ ఉండదని సమాచారం. 

బలహీనమైందని చెప్పడానికే హ్యాక్‌ చేశా!

అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ సెక్యూరిటీ వ్యవస్థ బలహీనమైందని చెప్పడానికే తాను ట్రంప్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసినట్లు విక్టర్ గెవెర్స్‌ పేర్కొన్నాడు. అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ సెక్యూరిటీ కోసం అమెరికా ప్రభుత్వం కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదనే విషయం హ్యాకింగ్‌తో తేలిందన్నాడు. గతంలో ఆయన పాస్‌వర్డ్‌ను తెలుసుకునేందుకు నాలుగు సార్లు ప్రయత్నించి ఫెయిలయ్యానని.. ఐదో సారికి విజయం సాధించినట్లు నెదర్లాండ్స్‌ మీడియాకు తెలిపారు. అమెరికా అధికారులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించి చివరికి సీక్రెట్ సర్వీస్‌ అధికారులను సంప్రదించానని.. భద్రతా ఉల్లంఘనలను వారి దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారని గెవర్స్‌ చెప్పాడు. అధ్యక్షుడి ట్విట్టర్ ఖాతాను హ్యాక్‌ చేయడం గేవర్స్‌కు ఇది మొదటిసారి కాదు. 2016 లో మరో ఇద్దరితో కలిసి ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ను గుర్తించారు. ఆ సమయంలో ఆ పాస్‌వర్డ్‌ “యు రిఫైర్డ్” - రియాలిటీ టీవీ ది అప్రెంటిస్‌లో వచ్చిన క్యాచ్ఫ్రేజ్.


logo