గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 15, 2020 , 11:56:35

డోనాల్డ్ ట్రంప్ కుమారుడికి సోకిన క‌రోనా

డోనాల్డ్ ట్రంప్ కుమారుడికి సోకిన క‌రోనా

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు బార‌న్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఈ విష‌యాన్ని ఫ‌స్ట్ లేడీ మిలానియా ట్రంప్ వెల్ల‌డించారు.  త‌న 14 ఏళ్ల కుమారుడికి వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు ఆమె చెప్పారు.  తొలుత వైట్‌హౌజ్ నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో బార‌న్ ట్రంప్ నెగ‌టివ్ తేలినా.. ఆ త‌ర్వాత ప‌రీక్ష‌లో అత‌నికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు మెలానియా చెప్పారు.  వైట్‌హౌజ్‌వెబ్‌సైట్‌లో క‌రోనా అనుభ‌వాల‌పై మెలానియా ఓ పోస్టు చేశారు.  రెండు వారాల క్రితం డోనాల్డ్ ట్రంప్‌తో పాటు మెలానియాకు వైర‌స్ సంక్ర‌మించింది. ఆ త‌ర్వాత వెంట‌నే త‌మ కుమారుడు బార‌న్ గురించి ఆలోచించామ‌ని ఆమె అన్నారు.  అయితే బార‌న్ టీనేజ‌ర్ కావ‌డం వ‌ల్ల అత‌నిలో ఎటువంటి వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌న్నారు.   

ఐయోవాలోని డెస్ మోయిన్స్‌లో జ‌రిగిన ర్యాలీలో మాట్లాడిన డోనాల్ట్ ట్రంప్‌.. త‌న కుమారుడు బార‌న్‌కు వైర‌స్ సోకిన‌ట్లు చెప్పారు. చాలా స్వ‌ల్ప స‌మ‌యం అత‌నికి వైర‌స్ సంక్ర‌మించింద‌న్నారు.  బార‌న్‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు అత‌నికి కూడా తెలియ‌ద‌ని,  అత‌నో యువ‌కుడ‌ని, వారి ఇమ్యూన్ సిస్ట‌మ్ బ‌లంగా ఉంటుంద‌ని, వైర‌స్‌తో వాళ్లు పోరాడ‌గ‌ల‌ర‌ని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.  బార‌న్ ఓ అంద‌మైన అబ్బాయి అని, అత‌ను స్వేచ్ఛ‌గా ఉంటాడ‌న్నారు.  వైర‌స్ నుంచి కోలుకున్న త‌న కుమారుడి కేసును విశ్లేషిస్తూ.. అందుకే అమెరికాలో స్కూళ్ల‌ను తెర‌వాల‌ని ట్రంప్ తెలిపారు.  పిల్ల‌ల‌కు వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు టీచ‌ర్ల సంఘాలు ఫిర్యాదు చేస్తున్న నేప‌థ్యంలో ట్రంప్ ఈ విష‌యం తెలిపారు. పిల్ల‌ల‌కు వైర‌స్ వ‌స్తుంటుంది, పోతుంటుంద‌ని, పిల్ల‌ల్ని  స్కూల్‌కు పంపించాలని ట్రంప్ అన్నారు. 


logo