శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 18:40:52

కరోనా వ్యాక్సిన్ వస్తేనే ట్రంప్ గట్టెక్కడం ఖాయం

కరోనా వ్యాక్సిన్ వస్తేనే ట్రంప్ గట్టెక్కడం ఖాయం

వాషింగ్టన్ : చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి అమెరికాకు చాలా నష్టం కలిగించింది. ఇదే సమయంలో రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పాలిట యమగండంగా కూడా తయారుకానున్నది. ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ వస్తేగానీ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గట్టెక్కడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.

కరోనా వైరస్ అమెరికాలో దాదాపు 54 లక్షలకుపైగా జనాభాకు సోకింది. 1.72 లక్షలకు పైగా మంది మరణించారు. లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు. అదే సమయంలో, ట్రంప్ రాజకీయ ఇమేజ్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పటికిప్పుడు అధ్యక్ష ఎన్నికలు జరిగితే ట్రంప్ ఘోరంగా ఓడిపోతారని అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ట్రంప్ కు మెజారిటీ 270 సీట్ల కన్నా 151 సీట్లు తక్కువ వస్తాయంట. ఈ పోల్‌లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ 298 సీట్లు సాధిస్తారని ఫలితం వచ్చింది. అయితే, ఈ పరిస్థితిని మెరుగుపరిచి అధ్యక్ష పీఠంపై మరోసారి అధిరోహించాలంటే ట్రంప్‌కు ఇప్పుడు కరోనా టీకా అత్యావశ్యంగా మారింది. ఎన్నికలకు ముందు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకురావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. రోజుకు చాలాసార్లు టీకా యొక్క విజయాన్ని ఆయన అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెలలోనే టీకా దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చి అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం తనకు అనుకూలంగా మారుతుందని ట్రంప్ ఆశిస్తున్నారు.

అమెరికాలో ఫేజ్-3 లో కొవిడ్ -19 యొక్క రెండు వ్యాక్సిన్ల పరిశీలన జరుగుతున్నది. ఈ టీకాలను బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా, ఫైజర్ సంస్థలు తయారు చేస్తున్నాయి. మార్చి నుంచి ఆపరేషన్ వార్ప్ స్పీడ్ ద్వారా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి అమెరికా ప్రభుత్వం 6.3 బిలియన్ డాలర్ల నిధిని అందజేసింది. రూ.700 కోట్ల విలువైన సిరంజిలు, సూదులు కొని వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చేనాటికి సిద్దంగా ఉంచాలని అమెరికా ఆదేశించింది.

మార్చిలో ముందున్న ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ 2016 నవంబర్ 9 న అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు. ఈ సమయంలో అమెరికాలో నిర్వహించిన అన్ని సర్వేలలో ట్రంప్‌కు ఉన్న ఆదరణ గొప్పగా ఉన్నది. 45.5 శాతం మంది ట్రంప్ ను ఇష్టపడగా.. 41.3 శాతం మంది ఇష్టపడలేదు. అయితే, క్రమంగా ట్రంప్ జనాదరణ తగ్గుతూ వస్తున్నది. 2018 జనవరిలో.. అతడిని 40.4 శాతం మాత్రమే ఇష్టపడగా.. 53.5 శాతం మంది ఇష్టపడలేదు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారికి ముందు మార్చిలో ట్రంప్ ప్రజాదరణ మెరుగుపడింది. ఈ సమయంలో అతడిని 46 శాతం ఇష్టపడగా.. కేవలం 48 శాతం ఇష్టపడలేదు. మరో 6 శాతం మందికి అభిప్రాయం లేదు. 2020 ఆగస్టు 14 న అతడి ప్రజాదరణ మళ్లీ 41.5 శాతానికి తగ్గింది. ప్రస్తుతం అతడిని 54.6 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.

టీకా పరీక్షలపై వివాదం

కరోనా వ్యాక్సిన్ పరీక్షల సమయంలో టీకాలు వేసిన మొదటి వాలంటీర్ రాబిన్.. ఓ నల్లజాతి మహిళ. దాంతో అమెరికన్ ఆఫ్రికన్ సమాజంలో ట్రంప్ పట్ల మరింత ఆగ్రహం నెలకొన్నది. టస్కీగీ ప్రయోగంలో అమెరికా గత 40 ఏండ్లుగా నల్లజాతీయులపై సిఫిలిస్ చికిత్స కోసం ప్రయోగాలు జరుపుతున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. జార్జి ఫ్లాయిడ్ మరణోదంతం దరిమిలా ట్రంప్ పై ఆగ్రహంతో ఉన్న నల్లజాతీయులు.. టస్కీగీ ప్రయోగాలతో మరింత కన్నెర్రజేస్తున్నారు. ఏదిఏమైనా, రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి విజయం సాధించాలంటే అక్టోబర్ నాటికల్లా కరోనా వ్యాక్సిన్ రావడం ఒక్కడే కారణం కానున్నదనేది నగ్నసత్యం.


logo