సోమవారం 01 జూన్ 2020
International - Apr 20, 2020 , 02:24:22

చైనా దోషిగా తేలితే..తీవ్ర పరిణామాలు

చైనా దోషిగా తేలితే..తీవ్ర పరిణామాలు

  •  హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 19: చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. చైనా ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు తేలితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంలో, ఆ విషయాలను తమతో పంచుకోవడంలో చైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. శనివారం ఆయన తన అధికార నివాసం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘తొలుత చైనాతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పుడైతే కరోనా వైరస్‌ బయటపడిందో అప్పటి నుంచి ఆ దేశంపై కోపం వస్తున్నది. ఒకవేళ చైనా ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు తేలితే ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ‘కరోనాకు సంబంధించి మనకు రెండు తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి వైరస్‌ను నియంత్రించలేకపోవడం.. రెండోది ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుండటం (వైరస్‌ గురించి ఆలోచించకుండా గాలికి వదిలేయడం అనే ఉద్దేశంలో). ఈ రెండు విషయాల్లో లోతుగా దర్యాప్తు జరుపడానికి మమ్మల్ని ముందుకు వెళ్లనివ్వండి అని చైనాను అడిగాము. కానీ ఆ దేశం అనుమతించడం లేదు. నాకు తెలిసి కరోనా విషయంలో ఏదో జరుగుతున్నది. ఈ వైరస్‌ కారణంగా వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు’ అని ట్రంప్‌ తెలిపారు. వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారన్నారు. మధ్యతూర్పు ప్రాంతంలో అత్యంత బలమైన ఇరాన్‌ ఇప్పుడు ఏవిధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నదో అందరికీ తెలిసిందేనని, బతికి బట్టకడితే చాలని ఆ దేశం భావిస్తున్నదని చెప్పారు. రంజాన్‌, ఈస్టర్‌ సందర్భంగా కూడా ముస్లింలు, క్రిస్టియన్లు ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్ణీత దూరం నిబంధనలను తప్పక పాటిస్తారన్న నమ్మకం తనకు ఉన్నదని ట్రంప్‌ పేర్కొన్నారు.

మరణాల్లో నంబర్‌వన్‌ చైనానే

కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్యలో చైనా నంబర్‌వన్‌గా ఉండొచ్చని ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘కరోనా మరణాలకు సంబంధించి చైనా వెల్లడిస్తున్న వివరాలు వాస్తవాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అమెరికాకన్నా చైనాలోనే ఎక్కువ మరణాలు సంభవించినట్లు అనుమానాలున్నాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. వుహాన్‌లో వైరస్‌ బారినపడి మరణించిన వారి సంఖ్యను ఇటీవల చైనా సవరించిన విషయం తెలిసిందే. దాదాపు 1,300 మరణాలను అధికంగా లెక్కల్లో చూపింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 


logo