గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 02, 2020 , 10:41:45

శాంతియుత నిర‌స‌న కాదు.. ఇది స్వ‌దేశీ ఉగ్ర‌వాదం

శాంతియుత నిర‌స‌న కాదు.. ఇది స్వ‌దేశీ ఉగ్ర‌వాదం

హైద‌రాబాద్‌: అమెరికాలోని విస్క‌న్‌సిన్ రాష్ట్రంలో ఇటీవ‌ల న‌ల్ల‌జాతీయులు భారీ విధ్వంసం సృష్టించారు.  కినోషా ప‌ట్ట‌ణం గ‌త కొన్ని రోజులుగా నిర‌స‌న జ్వాల‌ల‌తో ర‌గులుతున్న‌ది.  ఆగ‌స్టు 23వ తేదీన జాక‌బ్ బ్లేక్ అనే న‌ల్ల‌జాతీయుడిని పోలీసులు ఏడుసార్లు షూట్ చేశారు. దీంతో ఆ వ్య‌క్తి తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. అయితే పోలీసుల అకృత్యాల‌ను ఖండిస్తూ .. న‌ల్ల‌జాతీయులు భారీ హింస‌కు దిగారు. కినోషాలో ఉన్న షాపుల‌ను, మాళ్ల‌ను, అనేక ప్రాంతాల‌కు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు.  ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ ఒకటో తేదీన అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ ప‌ట్ట‌ణంలో టూర్ చేశారు.  హింస‌, విధ్వంసం వ‌ల్ల న‌ష్ట‌పోయిన ప్రాంతాల‌ను ఆయ‌న విజిట్ చేశారు.  భారీ విధ్వంసానికి స్వ‌దేశీ ఉగ్ర‌వాద‌మే కార‌ణమంటూ డోనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు.   

అమెరికా పోలీసు విభాగంలో వ్య‌వ‌స్థీకృత జాతివివ‌క్ష ఉన్న‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ట్రంప్ ఖండించారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఈ విధ్వంసం శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు నిద‌ర్శ‌నం కాదు అని, కానీ ఇది స్వ‌దేశీ ఉగ్ర‌వాదానికి ఉద‌హ‌ర‌ణ‌ అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. కినోషా ప‌ట్ట‌ణంలో వ్యాపార‌వేత్త‌ల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. పోలీసుల వైఖ‌రిని స‌మ‌ర్థించిన ట్రంప్‌.. కొన్ని చెడు సంఘ‌ట‌న‌ల‌కు మాత్ర‌మే మీడియా అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు ఆరోపించారు. కినోషాలో అల్ల‌ర్ల‌ను అదుపు చేసేందుకు నేష‌న‌ల్ గార్డ్స్ కూడా రంగంలోకి దిగారు.  అక్క‌డ మ‌ళ్లీ వ్యాపారాలు ప్రారంభించేందుకు 4 మిలియ‌న్ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.  

న‌వంబ‌ర్ 3వ తేదీన అమెరికా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  విస్కిన్‌స‌న్ రాష్ట్రం ఆ ఎన్నిక‌ల‌కు కీల‌క‌మైంది.  ఈ నేప‌థ్యంలో ట్రంప్ అక్క‌డ త‌న ఓటు బ్యాంకును పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  అల్ల‌ర్ల‌ల‌ను ఆర్ప‌కుండా ట్రంప్ వాటికి ఆజ్యం పోస్తున్నార‌ని డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి బైడెన్ ఆరోపించారు. ఓపీనియ‌న్ పోల్స్ ప్ర‌కారం..  బైడెన్‌, ట్రంప్ మ‌ధ్య వ్య‌త్యాసం తగ్గుతున్న‌ది. 
logo