ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 04, 2020 , 11:55:20

బిగ్ విన్‌.. ట్రంప్ ట్వీట్ తొల‌గింపు

బిగ్ విన్‌.. ట్రంప్ ట్వీట్ తొల‌గింపు

హైద‌రాబాద్‌:  అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ సంస్థ తొల‌గించింది.  భారీ విజ‌యం దిశ‌గా వెళ్తున్నామ‌ని, ఎన్నిక‌లను కైవ‌సం చేసుకోనున్న‌ట్లు ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ త‌న అకౌంట్ నుంచి తొల‌గించింది.  ప్ర‌త్య‌ర్థులు ఎన్నిక‌ల‌ను దోచేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. పోలింగ్ స‌మ‌యం ముగిసిన త‌ర్వాత ఓట్లు వేయ‌రాదు అని ట్రంప్ త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే మాజీ ఉపాధ్య‌క్షుడు, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని క్ష‌ణాల‌కే ట్రంప్ .. బిగ్ విన్  అని ఓ ట్వీట్ చేశారు.  అయితే ట్రంప్ పోస్టు చేసిన ట్వీట్‌లో ఉన్న సారాంశం.. ఎన్నిక‌ల ప్ర‌క్రియను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ త‌న వార్నింగ్‌లో పేర్కొన్న‌ది. 

మ‌నమే గెలుస్తాం :  బైడెన్‌

అమెరికా అధ్య‌క్ష రేసు ఉత్కంఠంగా మారిన నేప‌థ్యంలో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ కాసేప‌టి క్రితం దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా ట్రాక్‌లో ఉన్నామ‌ని బైడెన్ అన్నారు. దిలావేర్ నుంచి ఆయ‌న మాట్లాడుతూ.. ఇలా ర‌స‌వ‌త్త‌ర పోటీ ఉంటుంద‌ని మాకు ముందే తెలుసు అని, కానీ వ‌చ్చిన ఫ‌లితాల ప‌ట్ల మేం సంతోషంగా ఫీల‌వుతున్నామ‌ని, ఇది నిజంగా అద్భుత‌మ‌ని బైడెన్ అన్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే బాట‌లో ఉన్నామ‌న్నారు.  అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తేల్చేందుకు దేశం యావ‌త్తు చివ‌రి ఓటును లెక్కించే వ‌ర‌కు వేచి ఉండాల‌న్నారు.  మ‌ద్ద‌తుదారులంతా సంయ‌మ‌నంతో ఉండాల‌ని ఆయ‌న కోరారు. ఫ‌లితాల‌పై విశ్వాసం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. తుది ఫ‌లితాలు అనుకూలంగా ఉంటాయ‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.  ఆరిజోనాలో గెలుస్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.  మిచిగ‌న్, విస్కిన్‌స‌న్‌ ఫ‌లితాల ప‌ట్ల కూడా సంతోషంగా ఉంద‌న్నారు. జార్జియా ఈసారి కీల‌కంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం బైడెన్ 237, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను కైవ‌సం చేసుకున్నారు.