నవ్విపోదురు గాక .. నాకేటి సిగ్గు!

అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ విపరీత చర్య
జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు ఫోన్ కాల్
తననే విజేతగా ప్రకటించాలని తీవ్ర ఒత్తిడి
రీ కౌంటింగ్ జరిగినట్టు చెప్పాలని బలవంతం
గంట పాటు సంభాషణ.. ఆడియో లీక్
జార్జియాలో మేమే గెలిచాం
నేనే విజేత అని ప్రకటించడంలో తప్పు లేదు
మళ్లీ ఓట్లను లెక్కించామని చెప్పు.
వాషింగ్టన్, జనవరి 4: అమెరికా అధ్యక్ష పదవిని కోల్పోతున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం తీవ్రమవుతున్నది. ఎలాగైనా పదవిని కాపాడుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు హద్దులు మీరుతున్నాయి. బైడెన్ గెలుపును ఎప్పుడూ ఒప్పుకోని ట్రంప్ శనివారం అసాధారణ చర్యకు పూనుకొన్నారు. అమెరికాకు తలవంపులు తెచ్చే పనిచేశారు. జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్, రిపబ్లికన్ నేత బ్రాడ్ రఫెన్స్పెర్జర్కు ఫోన్ చేసి ఎన్నికల ఫలితాన్ని మార్చాలని, జార్జియాలో తననే విజేతగా ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. ట్రంప్ దాదాపు గంట సేపు బ్రాడ్‌తో సంభాషించిన ఆడియో ప్రస్తుతం అమెరికాలో సంచలనం కలిగిస్తున్నది. లీక్ అయిన ఆడియో కాల్ ప్రకారం.. ‘జార్జియా ప్రజలు కోపంగా ఉన్నారు. దేశమంతా కోపంగా ఉన్నది. జార్జియాలో మేమే గెలిచాం. కానీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఓట్లు మాకే వచ్చిన కారణంగా నేనే విజేత అని ప్రకటించడంలో తప్పు లేదు. మళ్లీ ఓట్లను లెక్కించామని చెప్పు’ అంటూ బ్రాడ్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకువచ్చారు. ట్రంప్ ఒత్తిడికి బ్రాడ్ తలొగ్గలేదు. ‘ప్రెసిడెంట్ గారు.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మీ దగ్గర ఉన్న సమాచారం తప్పు. ఎన్నిక న్యాయబద్ధంగానే జరిగింది’ అని సమాధానం ఇచ్చారు. కాగా, బ్రాడ్‌తో ఫోన్లో మాట్లాడినట్టు ఆదివారం ట్రంప్ ట్వీట్ చేశారు. ‘జార్జియాలో 17వేలకు పైగా ఓట్లు అక్రమంగా బైడెన్‌కు వెళ్లినట్టు సమాచారం ఉంది. ఎన్నికల్లో మోసాలు జరిగాయి. బయటి వ్యక్తుల, చనిపోయిన వ్యక్తుల ఓట్లు పోలయ్యాయి. దీనిపై సమాధానం చెప్పేందుకు బ్రాడ్ సిద్ధంగా లేరు’ అని ట్వీట్ చేశారు. దీనిపై బ్రాడ్ స్పందించారు. ‘ట్రంప్ చెప్తున్నది నిజం కాదు. వాస్తవం ఎప్పటికైనా బయటకు వస్తుంది’ అన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇది క్రిమినల్ నేరం
ట్రంప్ తాజా చర్య ప్రపంచం నోరెళ్లబెట్టేలా ఉన్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ దేశాధ్యక్షుడు ఇలాంటి చర్యకు పాల్పడటం అసాధారణమైన విషయమని అమెరికా న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఇది అధికార దుర్వినియోగం, క్రిమినల్ చర్య కిందకు వస్తుందని, దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు. ట్రంప్ చర్య ప్రజాస్వామ్యానికి విఘాతం అని పలువురు అభిప్రాయపడ్డారు.
ట్రంప్.. కాస్త తగ్గు!
మాజీ రక్షణ మంత్రుల మందలింపు
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ట్రంప్ వ్యవహారశైలితో అమెరికాలో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ట్రంప్ తీరును తప్పుబడుతూ పదిమంది మాజీ రక్షణ మంత్రులు తమ అభిప్రాయాలను వాషింగ్టన్ పోస్ట్‌లో వ్యాసం రూపంలో ప్రచురించారు. అయితే ఎక్కడా ట్రంప్ పేరును ప్రస్తావించకుండా అమెరికాలో ప్రస్తుత పరిణామాలపై ఆయనను పరోక్షంగా, తీవ్రంగా మందలించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యాన్ని రంగంలోకి దించితే దేశం తీవ్ర ప్రమాదకరస్థితిలోకి జారిపోతుందని, రాజ్యాంగబద్ధత కోల్పోతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు అధికారమార్పిడికి సహకరించాలని సూచించారు. రక్షణ శాఖలో ట్రంప్ నియమించిన అధికారులు అధికార మార్పిడిని అడ్డుకోవచ్చని బైడెన్ అనుమానం వ్యక్తం చేసిన సమయంలోనే వీళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించడం గమనార్హం. ‘ఎన్నికల ఫలితాలపై ప్రశ్నించాల్సిన సమయం ముగిసింది. కొత్త అధ్యక్షుడు రాజ్యాంగబద్ధంగా పదవిని చేపట్టే సమయం ఇది. ఈ సమయంలో సైన్యాన్ని వినియోగిస్తే ఫలితం మరోలా ఉంటుంది. అమెరికాలో రాజ్యాంగం, చట్టం చెల్లకుండా పోతాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వివాదాల పరిష్కారానికి ఆర్మీకి ఎలాంటి సంబంధం లేదని మాజీ రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లే ఇంతకుముందే చెప్పారు. మరోవైపు, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా డెమోక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ మళ్లీ ఎన్నికయ్యారు.
తాజావార్తలు
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు