బుధవారం 03 జూన్ 2020
International - Apr 19, 2020 , 14:48:35

చైనా పర్యవసానాలు ఎదుర్కోక తప్పదన్న ట్రంప్

చైనా పర్యవసానాలు ఎదుర్కోక తప్పదన్న ట్రంప్

హైదరాబాద్: కోవిడ్-19 లేదా కోరనావైరస్ తెలిసీ వ్యాప్తి చేసి ఉంటే చైనా అందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 'మొదలుకాక ముందే చైనాలో నిలువరించే అవకాశముండింది. కానీ అది జరుగలేదు. దానివల్ల మొత్తం ప్రపంచం బాధలు అనుభవిస్తున్నది' అని ఆయన మండిపడ్డారు. కోరనా వైరస్ టాస్క్ ఫోర్స్ రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒకవేళ అది పొరబాటు అయితే.. పొరబాటు పొరబాటే. కానీ తెలిసీ బాధ్యులైతే మాత్రం పర్యవసానాలు ఉంటాయని స్పష్టం చేశారు. ట్రంప్ సకాలంలో మేల్కొనలేదని, సరైన విధంగా స్పందించలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీని నుంచి దృష్టిని మళ్లించడానికే ఆయన ముందుగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై, తర్వాత సూటిగా చైనాపై దాడికి దిగుతున్నారని మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కోవిడ్-19 వైరస్‌ను ట్రంప్ 'చైనా వైరస్' అని సంబోధించడం వల్ల ఈ సరికే ఆసియా వ్యతిరేకత అమెరికాలో ప్రబలుతున్నది. ఇతర అధికారులు వైరస్ బయటపట్ట నగరం పేరిట 'వూహాన్ వైరస్' అని కూడా అంటున్నారు. కొందరు అమెరికా అధికారులు, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు చైనా వైరస్ వ్యాప్తి గురించిన నిజాలను దాచిందని అంటున్నారు. అందుకు సమర్థనగా వారు కొన్ని ఇంటలిజెన్స్ నివేదికలను ఉటంకిస్తున్నారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నది.


logo