శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 11:43:42

ట్రంప్‌కు క‌రోనా.. అధ్య‌క్ష అధికారాల‌ను బ‌దిలీ చేయ‌వ‌చ్చా ?

ట్రంప్‌కు క‌రోనా.. అధ్య‌క్ష అధికారాల‌ను బ‌దిలీ చేయ‌వ‌చ్చా ?

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఆ వైర‌స్ ఇప్పుడు అగ్ర‌రాజ్యాధినేత‌నూ వ‌ద‌ల‌లేదు. ట్రంప్‌లో వైర‌స్ ల‌క్ష‌ణాలు ఎలా ఉన్నాయో తెలియ‌దు. ఒక‌వేళ ట్రంప్ ఆ వైర‌స్ వ‌ల్ల తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోనైతే. అప్పుడు ఆయ‌న త‌న బాధ్య‌త‌ల‌ను ఎవ‌రికైనా బ‌దిలీ చేయ‌వ‌చ్చా.  ఆరోగ్య‌ప‌రంగా ప‌రిపాల‌న చేయ‌డం ఇబ్బందిగా మారితే.. దేశాధ్య‌క్షుడు ‌త‌న అధికారాల‌ను బ‌దిలీ చేసే విధానం అమెరికా రాజ్యాంగంలో ఉన్న‌దా అన్న అంశం ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది.  అమెరికా రాజ్యాంగంలోని 25వ స‌వ‌ర‌ణ‌ ప్ర‌కారం.. వైద్య‌ప‌రంగా బ‌ల‌హీనంగా, చితికిల‌ప‌డ్డ అధ్య‌క్షుడు.. తాత్కాలికంగా త‌న అధికారాల‌ను ఉపాధ్య‌క్షుడికి బ‌దిలీ చేసే వీలు ఉన్నది. ఎప్పుడు ఫిట్ ఉన్న‌ట్లు అనుకుంటే అప్పుడు మ‌ళ్లీ త‌న‌ అధికార బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశం ఉన్న‌ది.

1967లో అధికార బ‌దిలీపై రాజ్యాంగ స‌వ‌ర‌ణ జ‌రిగింది. మూడుసార్లు అమెరికా మాజీ అధ్య‌క్షులు  ఈ ఆప్ష‌న్‌ను వాడారు. 1985లో ఆనాటి అధ్య‌క్షుడు రోనాల్డ్ రీగ‌న్ కొల‌నోస్కోపీ చేయించుకున్నారు. అప్పుడు ఆయ‌న కొన్ని రోజుల పాటు త‌న అధికారాల్ని ఉపాధ్య‌క్షుడు జార్జ్ బుష్‌కు అప్ప‌గించారు.   ఆ త‌ర్వాత అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన జార్జ్ బుష్ కూడా రెండుసార్లు ఉపాధ్య‌క్షుడి డిక్ చినాయ్‌కి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 2002, 2007లో ఈ ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. జార్జ్ కూడా కొల‌నోస్కోపీ చేయించుకున్న స‌మ‌యంలో అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను బదిలీ చేశారు.  

ప్రెసిడెన్షియ‌ల్ స‌క్సెష‌న్ యాక్ట్ ప్ర‌కారం ఒక‌వేళ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్  కూడా అనారోగ్యం వ‌ల్ల‌ విధులు నిర్వ‌ర్తించ‌లేక‌పోతే, అప్పుడు స్పీక‌ర్ నాన్సీ పెలోసీకి బాధ్య‌తలు అప్ప‌గిస్తారు. ప్ర‌స్తుతం ఇలాంటి విప‌త్తు ఏదీ లేద‌ని వైట్‌హౌజ్ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. అధ్య‌క్షుడు ట్రంప్‌, ఉపాధ్య‌క్షుడు పెన్స్‌ల‌ను ఆరోగ్యంగానే ఉంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అధికారులు చెప్పారు. గ‌తంలో అమెరికా అధ్య‌క్షులు ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో  తీవ్ర అనారోగ్యానికి గురైన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. మ‌హమ్మారులు ప్ర‌బ‌లిన‌ స‌మ‌యంలోనే వాళ్లు డీలాప‌డ్డారు. అమెరికా మాజీ అధ్య‌క్షులు జార్జ్ వాషింగ్ట‌న్ ఓ ద‌శ‌లో ఫ్లూ వ‌ల్ల చావుకు ద‌గ్గ‌ర‌య్యారు. తొలి ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో పారిస్ చ‌ర్చ‌ల‌కు  వెళ్లిన వుడ్రో విల్స‌న్‌కు ఫ్లూ సోకి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు అమెరికా అధ్య‌క్షులు ఆఫీసులో ఉండ‌గానే ప్రాణాల‌ను కోల్పోయారు.  విలియ‌మ్ హెన్సీ హ్యారిస‌న్‌, జాచ‌రీ టేల‌ర్‌, వారెన్ హార్డింగ్‌, ఫ్రాక్లింన్ రూజ్‌వెల్ట్ ఆ జాబితాలో ఉన్నారు.  మ‌రో న‌లుగురు  అధ్య‌క్షులు ప‌దవిలో ఉన్న‌ప్పుడే హ‌త్య‌కు గుర‌య్యారు. వారిలో అబ్ర‌హం లింక‌న్‌, జేమ్స్ గారీఫీల్డ్‌,  విలియ‌మ్ మెక‌న్లే, జాన్ ఎఫ్ కెన్న‌డీలు ఉన్నారు. 

ట్రంప్ ఆరోగ్య అంశాల‌ను విశ్లేషిస్తే.. ఆయ‌న‌కు హై కొలెస్ట్రాల్ ఉన్న‌ది.  ఆయ‌న బ‌రువు 243 పౌండ్లు. ట్రంప్‌ ఎత్తుకు ఆ బ‌రువు ఓబెసిటీతో స‌మానంగా భావిస్తారు. గ‌త ఏడాది ఓ మిలిట‌రీ హాస్పిట‌ల్‌కు చెక‌ప్ కోసం ట్రంప్ వెళ్లారు.  అయితే ట్రంప్ ఏజ్ క్యాటగిరీ కీల‌కంగా మారింది. ఆయ‌న వ‌య‌సు 74 ఏళ్లు. అమెరికాలో క‌రోనాతో మృతిచెందిన వారిలో అధిక శాతం 65 ఏళ్లు దాటిన‌వాళ్లే ఉన్నారు. అమెరికాలో ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నం వైర‌స్ సోకి మృతిచెందారు.  ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధ్య‌క్షుడే పాజిటివ్‌గా తేలితే.. ఇక ఓట‌ర్లు భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చెప్ప‌లేం.  14 రోజుల క్వారెంటైన్ ప్ర‌క్రియ‌ను ట్రంప్ పాటిస్తారా లేదా వేచి చూడాల్సిందే. 


logo