శనివారం 16 జనవరి 2021
International - Jan 07, 2021 , 06:58:42

అమెరికా కాంగ్రెస్‌లో ఆందోళన హింసాత్మకం.. నలుగురు మృతి

అమెరికా కాంగ్రెస్‌లో ఆందోళన హింసాత్మకం.. నలుగురు మృతి

వాషింగ్టన్‌ : అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ మంగళవారం క్యాపిటల్‌ భవనంలో సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసకు దారి తీసింది. వందలాది మంది భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల కళ్లలో రసాయనాలను చల్లి క్యాపిటల్‌ భవనంలోకి దూసుకువెళ్లారు. అప్పటికే సమావేశంలో ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ నేతృత్వంలో రాష్ట్రాల వారీగా ఓట్ల ధ్రువీకరణ ప్రక్రియ సాగుతోంది. అలబామా, ఆలస్కాలో ఓట్లను ధ్రువీకరించారు. ఆ రెండు రాష్ట్రాల్లో 12 అక్కడ గెలిచిన ఓట్లు ట్రంప్‌కే దక్కాయి. అదే సమయంలో ట్రంప్‌ మద్దతుదారులు చొచ్చుకువెళ్లడంతో సమావేశం జరుగుతున్న భవనాన్ని మూసివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాంగ్రెస్‌ సభ్యులు గ్యాస్‌ మాస్కులు ధరించాలని సిబ్బంది సూచించారు.


బయట వారు లోపలికి.. లోపలికి వారు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ సహా మిగతా సభ్యులందరినీ వెంటనే మరోమార్గంలో నుంచి తరలించారు. భవనం అద్దాలు పగులగొట్టి లోపలికి చేరిన ట్రంప్‌ మద్దతుదారులు లోపల హల్‌చల్‌ చేశారు. ఈ క్రమంలో భవనంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే భవనం బయట జరిగిన ఘర్షణలో మరో ముగ్గురు మృతి చెందారు. ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో జాతీయ గార్డ్‌ సిబ్బందిని తరలించారు. ఘటనపై ట్రంప్‌ స్పందించారు. ఆందోళనకారులు ఇండ్లకు వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. మనకు శాంతి కావాలని, శాంతిభద్రతలను కాపాడే గొప్ప వ్యక్తులను మనం గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ శాంతియుతంగా ఉండాలన్నారు. రిపబ్లికన్​ పార్టీ అంటే శాంతి భద్రతలను కాపాడే పార్టీ అని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని ట్రంప్‌ మరోసారి తోసిపుచ్చారు. బైడెన్‌ ఎన్నికను తోసిపుచ్చాలని చేసిన వినతిని మైక్‌పెన్స్‌ తిరస్కరించడంతో ఆయనపై విరుకుపడ్డారు. పెన్స్‌ తన నిజాయితీని చూపలేదని ఆరోపించారు. 


మళ్లీ మొదలైన సమావేశం..

సుమారు నాలుగు గంటల ఆందోళనల తర్వాత పోలీసులు క్యాపిటల్‌ భవనం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. అనంతరం సురక్షితమేనని ప్రకటించారు. ఆందోళనకారులు లోపలికి వచ్చే లోపే భవనంలో ఉన్న ఓట్ల బాక్సులను భవనం నుంచి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆందోళన నేపథ్యంలో సాయంత్రం ఆరుగంటల వరకు వాషింగ్టన్‌లో కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చారు. అధికారులు భవనం సురక్షితమేనని ప్రకటించిన అనంతరం అమెరికా కాంగ్రెస్‌ భేటీ మళ్లీ ప్రారంభమైంది. కాగా, గతేడాది నవంబర్‌ ౩న జరిగిన ఎన్నికల్లో 306 ఎలక్టోరల్‌ ఓట్లతో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌పై (232 ఎలక్టోరల్‌ ఓట్లు ) విజయం సాధించారు. జోబైడెన్‌ ఎన్నికను ట్రంప్‌ను ధ్రువీకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అమెరికాలోని పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో కేసులు వేస్తూ వచ్చినా ఫలితం లేకుండాపోయింది.