శనివారం 30 మే 2020
International - May 06, 2020 , 19:50:02

కరోనా టాస్క్‌ఫోర్స్‌పై వెనక్కు తగ్గిన ట్రంప్

కరోనా టాస్క్‌ఫోర్స్‌పై వెనక్కు తగ్గిన ట్రంప్

హైదరాబాద్: చైనాపై తాను చేస్తున్న విమర్శలను దెబ్బతీసేలా మాట్లాడిన వైద్యనిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫాసీని ఇంటికి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపెట్టిన మార్పులు అటకెక్కాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్ లో చైనా కరోనా వైరస్ ను తయారు చేసిందని, అది కాస్తా బయటకు వచ్చి విళయం సృష్టిస్తున్నదని ట్రంప్ టంటాం వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది పూర్తిగా నిరాధారమని ఆయన సలహాదారు అయిన డాక్టర్ ఫాసీ కుండబొద్దలు కొట్టడం ట్రంప్‌కు సహజంగానే మింగుడు పడలేదు. డాక్టర్ ఫాసీ అమెరికా అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ మాత్రమే కాదు.. కరోనాపై ట్రంప్ స్వయంగా ఏర్పాటు చేసిన టాస్క్‌పోర్స్‌లో కీలక సభ్యుడు కూడా. అయితే ఏమాత్రం తేడా వచ్చినా అధికారులను ఇంటికి పంపే ట్రంప్ డాక్టర్ ఫాసీ విషయంలో వచ్చిన వ్యతిరేకత చూసి వెనుకకు తగ్గినట్టు కనిపిస్తున్నది. డాక్టర్ ఫాసీని టార్గెట్ గా చేసుకుని టాస్క్‌ఫోర్స్ రద్దు అవుతుందని ట్రంప్ ఫీలర్లు వదిలారు. కానీ కథ అడ్డం తిరిగింది. దాంతో నాలిక కరుచటుకున్నారు. మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనా చికిత్సకు ఉపకరిస్తుందని ట్రంప్ వాదించినప్పుడు కూడా డాక్టర్ ఫాసీ బహిరంగంగానే ఆయనతో విభేదించారు. ఇలా ముక్కుకుసూటిగా మాట్లాడే డాక్టర్ ఫాసీ అంటే అమెరికా ప్రజలకు అభిమానం ఏర్పడింది. అధ్యక్షుని పట్ల ప్రజాభిమానం తగ్గిపోయినట్టు సర్వేలు చూపుతున్నాయి. డాక్టర్ ఫాసీని ముట్టుకుంటే ప్రజలు తనను తిట్టుకుంటారని ట్రంప్ అర్థం చేసుకున్నారు. దీంతో టాస్క్‌ఫోర్స్ కొంచెం అటూఇటూగా కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించాల్సి వచ్చింది.


logo