శనివారం 30 మే 2020
International - Apr 09, 2020 , 01:48:45

ట్రంపన్న కన్నెర్ర

ట్రంపన్న కన్నెర్ర

  • డబ్ల్యూహెచ్‌వోకు నిధుల్ని నిలిపివేస్తామని హెచ్చరిక
  • కరోనా గురించి సమాచారమివ్వలేదని ధ్వజం
  • చైనాకు అనుకూలంగా ప్రవర్తించిందని ఆరోపణ

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 8: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతున్నది. వైరస్‌ కారణంగా చనిపోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ సత్ఫలితాల్ని ఇవ్వడంలేదు. దీంతో అధ్యక్షుడు ట్రంప్‌ తన అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయకుంటే భారత్‌పై ప్రతిచర్యకు పాల్పడుతానని హెచ్చరించిన మరునాడే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)పై కన్నెర్రజేశారు. తొలినాళ్లలో వైరస్‌ గురించి సరైన రీతిలో హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని ఆరోపిస్తూ.. అమెరికా నుంచి ఆ సంస్థకు ఇవ్వాల్సిన నిధుల్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. చైనాకు అనుకూలంగా ప్రదర్శిస్తున్నదని డబ్ల్యూహెచ్‌వోపై ధ్వజమెత్తారు. శ్వేతసౌధంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. ‘వైరస్‌ వెలుగుచూసిన తొలిరోజుల్లోనే డబ్ల్యూహెచ్‌వో దగ్గర దానిపై సమాచారం ఉన్నది. అయినా, దాన్ని మాతో పంచుకోలేదు. వైరస్‌పై మమ్మల్ని అప్రమత్తం చేయడంలో వాళ్లు విఫలమయ్యారు. వాళ్లకు అందుతున్న మొత్తం నిధుల్లో మాదే సింహభాగం. ఆ సంస్థకు ఇస్తున్న నిధుల్ని నిలిపివేస్తాం. వైరస్‌ నేపథ్యంలో చైనాకు ఎవ్వరూ ప్రయాణించవద్దని సూచించా. నా నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్‌వో విమర్శించింది. ఇది పెద్ద తప్పు. వాళ్లు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. కాగా, కరోనా అంశాన్ని  రాజకీయం చేయొద్దని  డబ్ల్యూహెచ్‌వో అమెరికాకు హితవు పలికింది. మరోవైపు, కరోనాపై అందరం సమిష్ఠిగా పోరాటం సాగించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది

చైనా చేతిలో తోలుబొమ్మ

కరోనా అంశంలో డబ్ల్యూహెచ్‌వో స్పందిస్తున్న తీరుపై అమెరికా సెనేట్‌ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్‌ జివ్‌ురిష్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌వోపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. చైనా ప్రభుత్వం చేతిలో డబ్ల్యూహెచ్‌వో తోలుబొమ్మగా మారిందని విరుచుకుపడ్డారు.


అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌

  • మోదీ చాలా మంచివాడన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారితో వణికిపోతున్న అమెరికాను ఆదుకోవడంలో భారత్‌ తన ఉదారతను చాటుకొన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజ్ఞప్తి మేరకు పెద్ద ఎత్తున కరో నా కట్టడికి వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులను భారత్‌ ఎగుమతి చేసింది. ఈ మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై విధించిన పూర్తి నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ నిర్ణయం తీసుకొన్న భారత్‌.. బుధవారం అమెరికాకు దాదాపు 2.90 కోట్ల డోసులను మందులను పంపింది. ‘అడిగిందే తడవుగా పెద్ద మొత్తంలో యాంటీ మలేరియా డ్రగ్‌ను పంపి భారత ప్రధాని నరేంద్రమోదీ తన గొప్ప మనుసును చాటుకొన్నారు. ఆయన చాలా మంచివారు’ అని హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులు అందగానే ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వాళ్లకు కూడా అవసరమైనందున ఈ మందులపై నిషేధం విధించారని, అయినప్పటికీ తన విజ్ఞప్తి మేరకు వెంటనే పంపి ఆదుకొన్నారని ట్రంప్‌ అన్నారు.

ఆగమై.. ఆపై నోరు జారి!

  • ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆగమాగం చేస్తున్నది. రోజూ పిట్టల్లా రాలిపోతున్న జనాన్ని చూసి ఉక్కిరిబిక్కిరవుతున్న ఆయన తన స్వీయ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. సాధారణంగానే తెంపరితనానికి ఉదాహరణగా నిలిచే ట్రంప్‌.. కరోనా నేపథ్యంలో అందరిపై నోరుపారేసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో కొన్ని.. 

  • కరోనాను ‘చైనీస్‌ వైరస్‌' అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి. కొవిడ్‌-19 చైనాలో వెలుగుచూసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 
  • కరోనా మెక్సికో నుంచి త్వరగా అమెరికన్లకు సోకే ప్రమాదమున్నదని, వలసదారుల అక్రమ రవాణాను నిరోధించేం దుకు తాను నిర్మించనున్న గోడ వైరస్‌ బారి నుంచి దేశ ప్రజల్ని రక్షిస్తుందని వ్యాఖ్యానించారు.
  • దేశంలో వైరస్‌ తీవ్రతను ఎక్కువగా చూపించి, ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష డెమొక్రాట్లపైనా ట్రంప్‌ ధ్వజమెత్తారు.
  • కరోనా మహమ్మారిగా మారుతుందని తనకు ఎప్పుడో తెలుసునని, అయితే, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో తాము విఫలమయ్యామని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


logo