గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 02, 2020 , 00:47:06

టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేస్తా: ట్రంప్‌

టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌: ఇప్పటికే భారత్‌లో నిషేధానికి గురైన ప్రఖ్యాత వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు అమెరికాలో కూడా ఎదురుదెబ్బ తగులబోతున్నది. టిక్‌టాక్‌పై నిషేధం విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనుందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారంలోపు (భారత కాలమానం ప్రకారం ఆదివారంలోపు) టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ‘టిక్‌టాక్‌ను అమెరికాలో శనివారంలోపు నిషేధించబోతున్నా. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ లేదా అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించి బ్యాన్‌ చేస్తా’ అని తెలిపారు. టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన ఏ కంపెనీ కొనుగోలు చేయడాన్ని తాను సమర్థించబోనని ట్రంప్‌ స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేయబోతున్నదని, ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ చర్చలు జరుపుతున్నదని శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.


logo