గురువారం 28 మే 2020
International - May 01, 2020 , 01:32:10

మాస్కులతో మిమ్మల్ని చూడలేకపోతున్నా!

మాస్కులతో మిమ్మల్ని చూడలేకపోతున్నా!

  • లాక్‌డౌన్‌ను కొనసాగించం: ట్రంప్‌

వాషింగ్టన్‌: ప్రజలు మాస్కులను ధరించడం, నిర్ణీత దూరాన్ని పాటించడం తాను చూడలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆంక్షల్ని కొనసాగించబోమని బుధవారం చెప్పారు. వైరస్‌ కట్టడిలో భాగంగా విధించిన ఆంక్షల గడువు గురువారంతో ముగియనున్నది. ఈ క్రమంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘ఓపెనింగ్‌ అప్‌ అమెరికా ఎగైన్‌' పేరుతో పారిశ్రామికవేత్తలతో శ్వేతసౌధంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. కనిపించని శత్రువు చేసిన దాడితో తీవ్రంగా ప్రభావితమైన అమెరికా ప్రజలకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థ నాలుగో త్రైమాసికంనాటికి పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చేవారం అరిజోనా పర్యటనకు వెళ్లనున్నట్టు చెప్పారు. మరోవైపు జూలైలో అమెరికా మళ్లీ పూర్వ స్థితికి వస్తుందని ట్రంప్‌ అల్లుడు కుష్నర్‌ ధీమా వ్యక్తం చేశారు. కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థల్ని తిరిగి ప్రారంభించేందుకు 35 రాష్ర్టాలు కార్యాచరణ ప్రకటించాయని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తెలిపారు. బుధవారం నాటికి 10,65,000 మందికి కరోనా సోకగా, 61 వేల మంది మరణించారు. 


logo