బుధవారం 03 జూన్ 2020
International - Apr 24, 2020 , 01:44:51

వారికి మినహాయింపు

వారికి మినహాయింపు

  • నిషేధం నుంచి వైద్యసిబ్బందికి, పెట్టుబడిదారులకు ఉపశమనం
  • ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం

వాషింగ్టన్‌: అమెరికాలోకి తాత్కాలిక వలసల నిషేధం నుంచి వైద్య సిబ్బందికి, పెట్టుబడిదారులకు మినహాయింపు ఇచ్చా రు. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ దిగజారిన నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగ రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో తాత్కాలిక వలసలపై 60 రోజులపాటు నిషేధం విధించే ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం సంతకం చేశారు. ‘అమెరికా ఉద్యోగులను కాపాడేందుకు వలసల్ని తాత్కాలికంగా నిషేధించే ఉత్తర్వులపై ఇప్పుడే సంతకం చేశాను. ఇది చాలా శక్తివంతమైన ఉత్తర్వు’ అని మీడియాకు తెలిపారు. ఈ ఉత్తర్వు జారీ చేసిన నాటికి ధ్రువీకరించిన ఇమ్మిగ్రేషన్‌ వీసా లేని వారితోపాటు వీసా ఉన్నప్పటికీ ప్రయాణ అనుమతి పత్రం లేని విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. మరోవైపు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. దేశంలోని గ్రీన్‌కార్డు కలిగిన విదేశీయులు, వైద్య రంగానికి చెందిన వారు, పెట్టుబడుల కేటగిరీ ద్వారా అమెరికాలో చట్టపరంగా శాశ్వతంగా నివాసం ఉండాలనుకునేవారికి , అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, 21 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న అమెరికా జాతీయులు, లేదా వారిని దత్తతు తీసుకునే వారికి ఈ నిషేధం వర్తించదు. 

భారత్‌పై ప్రభావమెంత?

అమెరికా వలసల నిషేధం ఉత్తర్వుపై భారత్‌ అధ్యయనం చేస్తున్నది. ఉద్యోగం కోసం అమెరికాలోకి ప్రవేశించాలనుకునేవారిపైనే దీని ప్రభావం ఉండవచ్చని తెలుస్తున్నది. కాగా, నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలు, సంబంధిత కార్యక్రమాలకు ఈ ఉత్తర్వు వర్తించదని స్పష్టమవుతున్నదని ఓ అధికారి తెలిపారు. అమెరికా-భారత్‌ మధ్య బలమైన సంబంధాలున్న నేపథ్యంలో ఇరువురికి లబ్ధిచేకూర్చే వీసాలు కొనసాగవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో హెచ్‌ 1బీ వీసాలపై దీని ప్రభావం ఉండబోదన్నారు. 


logo