మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 09, 2020 , 01:32:12

ఇంకా ముగియలేదు!

ఇంకా ముగియలేదు!

  • ఓటమిని అంగీకరించని ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయాన్ని ఆ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని ఆయన అంగీకరించడం లేదు. నిజాయతీగా ఓట్ల లెక్కింపును జరిపేంతవరకు విశ్రమించబోనని స్పష్టంచేస్తున్నారు. హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. అయితే  ఓట్ల లెక్కింపుపై ట్రంప్‌ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నికలను తన నుంచి అక్రమంగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘అధ్యక్షుడు ఎవరనేది లీగల్‌ ఓట్లు నిర్ణయిస్తాయి. న్యూస్‌ మీడియా కాదు’ అంటూ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

మా వాళ్లను పోలింగ్‌ కేంద్రంలోకి రానివ్వలేదు..

‘నిష్పాక్షిక ఎన్నికలు అమెరికా ప్రజల హక్కు. లీగల్‌ ఓట్లను లెక్కించాలని దానర్థం. అక్రమ ఓట్లను లెక్కించడం కాదు’ అని ట్రంప్‌ అన్నారు. తమ పరిశీలకులను పోలింగ్‌ కేంద్రంలోకి రానీయలేదని ఆరోపించారు. ‘బైడెన్‌ ఏం దాస్తున్నారు? నిజాయతీగా ఓట్లను లెక్కించేంతవరకు నేను విశ్రమించబోను’ అని ట్రంప్‌ స్పష్టంచేశారు.

పెద్ద ఎత్తున్న ఆందోళనలు..

 కౌంటింగ్‌పై ట్రంప్‌ మద్దతుదారులు దేశవ్యాప్తంగా శనివారం ఆందోళనలు చేపట్టారు. ‘ఇది ఇంకా ముగియలేదు’, ‘(విజయాన్ని) దొంగిలించడం ఆపండి’ అంటూ నినాదాలు చేశారు. పలువురు ఆందోళనకారులు బహిరంగంగానే తుపాకులు చేతబట్టారు. కొన్ని నగరాల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. రిపబ్లికన్లకు కంచుకోట అయిన జార్జియాలో పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు.