మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Feb 06, 2020 , 02:17:00

ట్రంప్‌, నాన్సీ.. భగ్గు భగ్గు!

ట్రంప్‌, నాన్సీ.. భగ్గు భగ్గు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆ దేశ ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న పోరు మరోసారి బయటపడింది. మంగళవారం రాత్రి దేశాధ్యక్షుడు చేసే వార్షిక ప్రసంగం సందర్భంగా ఇరువురూ తమ దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు ప్రయత్నించారు. అధ్యక్షుడిని ప్రసంగించేందుకు ఆహ్వానించే సమయంలో సభా సంప్రదాయాల ప్రకారం.. స్పీకర్‌ ‘ట్రంప్‌ను ఆహ్వానించడం నాకు దక్కిన ప్రత్యేక గౌరవం, గొప్ప ఆధిక్యత’ అని పేర్కొనాలి. కానీ ఆమె అత్యంత సాధారణంగా ‘అమెరికా అధ్యక్షుడు ప్రసంగిస్తారు’ అంటూ ఆహ్వానించారు. వెంటనే వేదిక వద్దకు వెళ్లిన ట్రంప్‌ తన ప్రసంగ పాఠాన్ని నాన్సీకి అందజేశారు. వాటిని అందుకున్న నాన్సీ ట్రంప్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు తన చేయిని ముందుకు చాచారు. కానీ ట్రంప్‌ ఆమెను పట్టించుకోకుండా వెనుదిరిగి వచ్చి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ట్రంప్‌ ప్రసంగం ముగిసిన వెంటనే నాన్సీ ఆయన ఇచ్చిన ప్రసంగం పాఠాన్ని సభలోనే బహిరంగంగా చింపేశారు. 


logo