ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 25, 2020 , 17:33:58

ట్రంప్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.. వుహాన్ ల్యాబ్ శాస్త్ర‌వేత్త‌

ట్రంప్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.. వుహాన్ ల్యాబ్ శాస్త్ర‌వేత్త‌

హైద‌రాబాద్‌: చైనాలోని వుహాన్‌లో ఉన్న ‌వైరాల‌జీ ల్యాబ్ నుంచి క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం అంతా పాకిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌పై ఆ ల్యాబ్‌లో క‌రోనా వైర‌స్‌ల‌పై స్ట‌డీ చేస్తున్న వైరాల‌జిస్ట్ షీ జెంగ్లీ తొలిసారి స్పందించారు.  వుహాన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీలో ఆమె 15 ఏళ్ల నుంచి గ‌బ్బిలాల ద్వారా సోకే సార్స్ లాంటి వైర‌స్‌ల‌పై అధ్య‌య‌నం చేస్తున్న‌ది. అయితే వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ట్రంప్ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా ఆ ల్యాబ్‌లోనే కృత్రిమ వైర‌స్‌ను సృష్టించి ఉంటార‌న్న వదంతులు కూడా వ్యాపించాయి. ఈ అంశాల‌పై వైరాల‌జిస్ట్ షీ జెంగ్లీ సైన్స్ మ్యాగ్జిన్‌కు స‌మాధానం ఇచ్చారు. 

వైర‌స్ పుట్టుక‌, దాని ప‌రిశోధ‌న గురించి ఆమె ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చారు.  SARS-CoV-2 త‌మ ల్యాబ్ నుంచి వ‌చ్చిన‌ట్లు ట్రంప్ చేసిన ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాద‌న్నారు. ఆ వ్యాఖ్య‌లు త‌మ ప్ర‌యోగాల్ని దెబ్బ‌తీస్తాయ‌ని, వ్య‌క్తిగ‌త జీవితం కూడా నాశ‌నం అవుతుంద‌న్నారు. ట్రంప్ త‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

న్యూమోనియా వ‌చ్చిన రోగుల శ్యాంపిళ్లు త‌న ల్యాబ్‌కు గ‌త ఏడాది డిసెంబ‌ర్ 30వ తేదీన వ‌చ్చిన‌ట్లు ఆమె చెప్పారు. అంత‌కుముందు SARS-CoV-2 లాంటి వైర‌స్ గురించి విన‌లేదు, స్ట‌డీ చేయ‌లేద‌న్నారు. వుహాన్‌తో పాటు స్వ‌దేశీ ల్యాబ్‌ల్లో వైర‌స్‌ను ప‌రీక్షించి వేగంగా ప్యాథోజెన్ గుర్తించిన‌ట్లు చెప్పారు. త‌మ ల్యాబ్ నుంచి ఎటువంటి వైర‌స్ లీక్ కాలేదని, త‌మ ల్యాబ్‌లో ఉన్న గ‌బ్బిలాల వైర‌స్ సీక్వెన్స్‌తో SARS-CoV-2ను స‌రిపోల్చ‌లేక‌పోయిన‌ట్లు ఆమె చెప్పారు. గ‌తంలో వుహాన్ ల్యాబ్‌లో వంద‌ల సంఖ్య‌లో గ‌బ్బిలాల‌కు చెందిన వైర‌స్‌ల‌ను గుర్తించామ‌ని, కానీ ఎప్పుడూ SARS-CoV-2 వైర‌స్‌ను గుర్తించ‌లేద‌ని షీ జెంగ్లీ తెలిపారు.

గ‌బ్బిలాల్లో ఉండే RaTG13 వైర‌స్ SARS-CoV-2కు స‌మానంగా ఉన్న‌ట్లు భావించారు. అయితే ఆ రెండు వైర‌స్‌ల‌ను స్ట‌డీ చేసిన శాస్త్ర‌వేత్త‌లు.. రెండింటి మ‌ధ్య సీక్వెన్స్ తేడాకు కార‌ణం అంచ‌నా వేశారు. బ‌హుశా 20 నుంచి 70 ఏళ్ల మ‌ధ్య ఒకే విధ‌మైన పూర్వీకుల నుంచి ఆ వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు గుర్తించారు. త‌మ ల్యాబ్‌లో ఎప్పుడూ RaTG13 వైర‌స్‌ను క‌ల్చ‌ర్ చేయ‌లేద‌న్నారు. పూర్తి బ‌యోసేఫ్టీ రూల్స్ ప్ర‌కారం తాము ప‌రీక్ష‌లు చేప‌డుతామ‌న్నారు. త‌మ ల్యాబ్‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌భుత్వం త‌నిఖీ చేస్తుంద‌న్నారు.  SARS-CoV-2 లేదా సార్స్ సంబంధిత వైర‌స్‌ల‌తో త‌మ ఇన్స్‌టిట్యూట్‌లోని వారెవ్వ‌రికీ వైర‌స్ సోక‌లేద‌న్నారు. యాంటీబాడీ ప‌రీక్ష‌ల ద్వారా ఆ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు ఆమె చెప్పారు.   SARS-CoV-2 వైర‌స్ గురించి షీ జెంగ్లీ ఇచ్చిన రిపోర్ట్‌ను ఇత‌ర మేటి వైరాల‌జీ శాస్త్ర‌వేత్త‌లు కూడా అంగీక‌రించారు. logo