శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 13, 2020 , 01:31:02

ట్రంప్‌ను కలిసిన అధికారికి కరోనా

ట్రంప్‌ను కలిసిన అధికారికి కరోనా

బ్రసీలియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఇటీవల భేటీ అయిన ఓ బ్రెజిల్‌ అధికారికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని బ్రెజిల్‌ అధ్యక్షుని కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. బ్రెజిల్‌ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోకు మీడియా కార్యదర్శిగా పనిచేస్తున్న ఫబియో వాజన్‌గర్టెన్‌ గత శనివారం అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ట్రంప్‌తో ఫ్లోరిడా రీసార్ట్‌లో సమావేశమయ్యారు. పర్యటన అనంతరం అస్వస్థతకు గురైన అధికారికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు తేలింది. కాగా అతనితో అధ్యక్షుడు బోల్సొనారోతో పాటు ఇతర సిబ్బంది కూడా పర్యటనకు వెళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, కరోనా నేపథ్యంలో.. జపాన్‌ రాజధాని టోక్యోలో త్వరలో జరుగనున్న ఒలంపిక్స్‌ క్రీడల్ని ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహానిచ్చారు.

కెనడా ప్రధాని భార్యకు వైరస్‌?

అట్టావా: కెనడా ప్రధాని సతీమణి సోఫీ గ్రెగోయిర్‌ ట్రూడో కు కరోనా సోకినట్లు సమాచారం. బ్రిటన్‌లోని ఓ కార్యక్రమంలో ప్రసంగించి బుధవారం తిరిగి వచ్చిన ఆమెకు ఫ్లూ లక్షణాలు కనిపించగా, పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. పలువురు నేతలతో జరుగాల్సిన సమావేశాలను ఆయన రద్దు చేసుకున్నారు. 


logo