శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 15:46:53

అవ‌రోధాలు, అవ‌మానాలు.. గంద‌ర‌గోళంగా తొలి డిబేట్‌

అవ‌రోధాలు, అవ‌మానాలు.. గంద‌ర‌గోళంగా తొలి డిబేట్‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌,  డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బిడెన్ మ‌ధ్య జ‌రిగిన తొలి ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ గంద‌ర‌గోళంగా సాగిన‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.   90 నిమిషాల పాటు సాగిన చ‌ర్చ‌లో అవ‌రోధాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ట్రంప్‌, బిడెన్ మ‌ధ్య చ‌ర్చ‌కు ఫాక్స్ న్యూస్ యాంక‌ర్ క్రిస్ వాలెస్ మాడ‌రేట‌ర్‌గా చేశారు.  అయితే చ‌ర్చ స‌మ‌యంలో దాదాపు 73 సార్లు అవరోధాలు ఏర్ప‌డిన‌ట్లు విశ్లేష‌కులు వెల్ల‌డించారు.  తొలి డిబేట్‌లో ఆరు అంశాల‌పై చ‌ర్చ సాగింది.  దాంట్లో క‌రోనా వైర‌స్ గురించి అత్య‌ధికంగా 20 నిమిషాలు పాటు చ‌ర్చించారు.  మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం, వ్యాక్సిన్లు, మాస్కులు, సంక్షోభాన్ని ట్రంప్ ఎదుర్కొన్న తీరును చ‌ర్చించారు.  

ఇక జాతివివ‌క్ష అంశంపై సుమారు 17 నిమిషాల పాటు చ‌ర్చ సాగింది.  జాతివివ‌క్ష దాడులు, హింస గురించి ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు మాట‌లు విసురుకున్నారు.  11 నిమిషాల పాటు ఎన్నిక‌ల ఐక్య‌త‌పై,  వాతావ‌ర‌ణ మార్పుల‌పై 10 నిమిషాల పాటు చ‌ర్చ సాగింది.  అయితే మొత్తం చ‌ర్చ‌లో బిడెన్ క‌న్నా ట్రంప్ త‌క్కువ‌గా మాట్లాడారు.   బిడెన్ మాట్లాడుతుంటే ట్రంప్ ప‌దే ప‌దే అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.  మాడ‌రేట‌ర్ క్రిస్ వాలెస్ అనేక సార్లు ట్రంప్‌ను నివారించే ప్ర‌య‌త్నం చేశారు.  ట్రంప్ 38 నిమిషాల పాటు మాట్లాడ‌గా.. బిడెన్ 43 నిమిషాల పాటు చ‌ర్చ‌లో మాట్లాడారు.  

బిడెన్ మాట్లాడుతుంటే 73 సార్లు ట్రంప్ అడ్డుత‌గిలారు.  2016లోనూ డిబేట్ స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి హిల్ల‌రీ క్లింటన్‌ను 37 సార్లు ట్రంప్ అడ్డుకున్న‌ట్లు రికార్డులు చెబుతున్నాయి.  ట్రంప్ మాట్లాడేందుకు ఆయ‌న‌కు మాడ‌రేట‌ర్ క్రిస్ వాలెస్ ఎక్కువ ఛాన్సులు కూడా ఇచ్చారు.  అయితే ఓ ద‌శ‌లో దిగ‌జారి మాట్లాడిన బైడెన్‌.. ట్రంప్‌ను నోరుమూసుకోమ‌న్నారు. ఇక ట్రంప్ కూడా బైడెన్ ఇంటెలిజెన్స్‌ను ప్ర‌శ్నించారు. ఫాక్స్ యాంక‌ర్ క్రిస్ వాలెస్ స‌రైన రీతిలో మాడ‌రేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. స‌మ‌స్య‌ల‌పై సంపూర్ణంగా చ‌ర్చించుకుందాం అంటూ క్రిస్ ప‌లుమార్లు ఇద్ద‌ర్నీ వేడుకున్నారు.  ఓ ద‌శ‌లో ట్రంప్‌ను ఆయ‌న గ‌ట్టిగా నిలువ‌రించారు. 

ఆదాయంప‌న్ను విషయంలో ట్రంప్‌ను బిడెన్ నిల‌దీయ‌లేక‌పోయార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.  డిబేట్‌కు రెండు రోజుల ముందే న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ ఐటీపై క‌థ‌నాన్ని రాసినా.. దాన్ని బిడెన్ చ‌ర్చ స‌మ‌యంలో వాడుకోలేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్‌పై రికార్డును కూడా ట్రంప్ డిఫెండ్ చేసుకున్నారు. తాను తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్లే మ‌ర‌ణాలు రేటు త‌గ్గిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 47 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా దేశానికి ఏమీ చేయ‌లేద‌ని బైడెన్‌పై ట్రంప్ విమ‌ర్శ‌లు చేశారు. 

బ్లీచింగ్ తీసుకుంటే క‌రోనా వైర‌స్ త‌గ్గుతుంద‌ని ట్రంప్ చేసిన కామెంట్‌ను బిడెన్ గుర్తు చేశారు. ఆ కామెంట్‌ను తాను స‌ర‌దాగా చేశాన‌ని, అది నీకు తెలుసు అని డిబేట్ సంద‌ర్భంగా ట్రంప్ రిప్లై ఇచ్చారు. వాస్త‌వానికి చ‌ర్చ క‌న్నా ఎక్కువ‌గా ఒక‌రిపై ఒక‌రు మాట‌లు విసురుకున్నారు. ఒబామాకేర్ ర‌ద్దు అంశాన్ని మాడ‌రేట‌ర్ వాలెస్ సీరియ‌స్‌గా తీసుకున్నారు.  ఒబామాకేర్‌కు బ‌దులుగా మీరు మ‌రో ప్లాన్ ఎందుకు తీసుకురాలేద‌ని క్రిస్ ప్ర‌శ్నించారు. ఆ స‌మ‌యంలో మాడ‌రేట‌ర్‌, ట్రంప్ మ‌ధ్య కాస్త వాగ్వాదం జ‌రిగింది. 

సుప్రీంకోర్టుకు ఆమీ కానే బారెట్‌ను నామినేట్ చేయ‌డాన్ని ట్రంప్ స‌మ‌ర్థించారు.  ఆమె అసాధార‌ణ జ‌డ్జి అన్నారు.   తానేమీ మూడేళ్ల కోసం ఎన్నిక కాలేద‌ని, నాలుగేళ్ల కోసం ఎన్నిక‌య్యాన‌ని, సుప్రీం జ‌డ్జిగా అమీని నామినేట్ చేయ‌డం త‌ప్పుకాద‌ని ట్రంప్ అన్నారు.