బుధవారం 20 జనవరి 2021
International - Dec 09, 2020 , 12:56:02

ఏలియ‌న్స్ ఉన్నారు.. ఆ విష‌యం ట్రంప్‌కు తెలుసు!

ఏలియ‌న్స్ ఉన్నారు.. ఆ విష‌యం ట్రంప్‌కు తెలుసు!

జెరుస‌లెం: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఏలియ‌న్స్ ఉనికిపై కొన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ బాస్ హైమ్ ఇషెద్‌. ఏలియ‌న్స్ ఉన్నార‌ని ట్రంప్‌కు తెలుస‌ని అన్నారు. మూడు ద‌శాబ్దాల పాటు ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ హెడ్‌గా చేసిన 87 ఏళ్ల ఇషెద్ వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మ‌నుషులు ఇంకా త‌మ స్థాయికి చేరుకోలేద‌ని, అందుకే తాము ఉన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌కూడ‌ద‌ని ఏలియ‌న్స్ చెప్పిన‌ట్లు ఇషెద్ వెల్ల‌డించారు. ఇజ్రాయెల్‌కు చెందిన యెడియ‌ట్ అహ‌రోనోత్ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇషెద్ ఈ సంచ‌న‌ల విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు ఇప్ప‌టికే అమెరికా ప్ర‌భుత్వం, గ‌లాక్టిక్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఏలియ‌న్స్ మ‌ధ్య ఒప్పందం కూడా కుదిరిన‌ట్లు ఇషెద్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. విశ్వాన్ని పూర్తిగా అధ్య‌య‌నం చేయ‌డంలో భాగంగా ఏలియ‌న్స్‌, అమెరికా ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందం కుదిరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 

అరుణ గ్ర‌హంపై ఓ ర‌హ‌స్య అండ‌ర్‌గ్రౌండ్ బేస్‌కు సంబంధించి కూడా ఈ ఒప్పందంలో ఉన్న‌ట్లు ఇషెద్ తెలిపారు. మ‌నుషులు ఇంకా త‌మ స్థాయికి చేరుకోలేద‌ని, అందుకే త‌మ ఉనికిని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కూడ‌ద‌ని గ‌లాక్టిక్ ఫెడ‌రేష‌న్ కోర‌డం వ‌ల్లే ట్రంప్ ఈ విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచార‌ని ఇషెద్ అన్నారు. అస‌లు స్పేస్ అంటే ఏంటి.. స్పేస్‌షిప్స్ అంటే ఏంటి అనే అంశాలు తెలుసుకొని, త‌మ స్థాయికి మ‌నుషులు చేరుకోవాల‌ని ఏలియ‌న్స్ చెప్పిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇప్పుడు తాను చెబుతున్న విష‌యాల‌ను ఐదేళ్ల ముందు చెప్పి ఉంటే తాను ఆసుప‌త్రిపాల‌య్యే వాడిన‌ని కూడా ఇషెద్ చెప్ప‌డం విశేషం. ఇదే విష‌యాన్ని త‌న బుక్ ది యూనివ‌ర్స్ బియాండ్ ద హారిజాన్‌లోనూ ఇషెద్ ప్ర‌స్తావించారు. అయితే ఇషెద్ చెప్పిన అంశాల‌పై అటు అమెరికా ప్ర‌భుత్వంగాకీ, ట్రంప్‌గానీ స్పందించ‌లేదు. కానీ ఇషెద్ వెల్ల‌డించిన ఈ సంచ‌ల‌న విష‌యాల‌పై ట్విట‌ర్‌లో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. 


logo