శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 17:37:56

ట్రంప్ మూర్ఖుడు, అబద్ధాల కోరు.. సోదరి ఆరోపణ

ట్రంప్ మూర్ఖుడు, అబద్ధాల కోరు.. సోదరి ఆరోపణ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక మూర్ఖుడు, అబద్ధాల కోరు అని ఆయన సోదరి మరియన్నే ట్రంప్ బారీ ఆరోపించారు. ట్రంప్ ఎవరిని కూడా అంత త్వరగా నమ్మడని.. తన సిద్ధాంతాల కోసం ఏమైనా చేస్తాడని, ఎంతదూరమైనా వెళ్తాడని ఆమె విమర్శించారు. ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, ట్రంప్ ట్వీట్లు కూడా అలాగే ఉంటాయని అన్నారు. మరియన్నే న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని కూడా తప్పుపట్టారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించడాన్ని ఆమె ఖండించారు. ఒక మతాన్ని నమ్మే వ్యక్తి ప్రజలకు సహాయంగా ఉంటాడని, ట్రంప్ మాత్రం దీనికి భిన్నమని మరియన్నే చెప్పారు. ట్రంప్ ఏమీ చదువుకోలేదని, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షను మరొకరితో రాయించారని ఆమె ఆరోపించారు. ట్రంప్ ఒక క్రూరుడని అభివర్ణించారు.

మరియన్నే రహస్యంగా రికార్డు చేసిన ఆమె వ్యాఖ్యలను ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్ రచించిన టాక్సిక్ ఫ్యామిలీ అనే పుస్తకంలో ప్రచురించారు. కాగా గత వారం మరణించిన అధ్యక్షుడి తమ్ముడు రాబర్ట్ ట్రంప్‌, మేరీ రాసిన పుస్తక ప్రచురణను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, మేరీ అందులో పేర్కొన్న ఒక ఒప్పందంపై ఆయన కోర్టును ఆశ్రయించారని మరియన్నే చెప్పారు. ఈ పుస్తకం సుమారు 9 లక్షల 50 వేల కాఫీలు అమ్ముడయ్యాయని.. కానీ వైట్‌ హౌస్‌ మాత్రం అది అబద్ధాల పుస్తకం అంటూ తప్పడు ప్రచారం చేస్తున్నదని మరియన్నే విమర్శించారు. కాగా, తన సోదరి వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించలేదు. అయితే రిపబ్లికన్‌ పార్టీ మాత్రం రానున్న ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలనే ప్రయత్నంలోనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo