గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 08, 2020 , 02:03:52

ట్రంప్‌ మంకుపట్టు

ట్రంప్‌ మంకుపట్టు

  • హెచ్‌1బీపై ఆయన నిర్ణయాలను కోర్టులు కొట్టేసినా..  వీసా నిబంధనల్లో మళ్లీ కీలక మార్పులు 
  • కంపెనీలు అమెరికన్లకు విధిగా ఉద్యోగాలివ్వాలి 
  • ఆ తర్వాతే విదేశీ వృత్తి నిపుణులకు అవకాశం 
  • భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం 

వాషింగ్టన్‌, అక్టోబర్‌ 7: హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ మంకుపట్టు వీడటం లేదు. ఆ వీసాలను రద్దు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు కొట్టేసినా.. ఆయన ససేమిరా అంటున్నారు. తాజాగా.. హెచ్‌1బీ వీసా నిబంధనల్లో మరోమారు కీలక మార్పులు చేశారు. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు ఉద్యోగుల నియామకంలో విధిగా అమెరికన్లకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) మంగళవారం జారీచేసిన నూతన మార్గదర్శకాల్లో స్పష్టచేసింది. ఈ మార్గదర్శకాలపై 60 రోజుల్లోగా అభిప్రాయం చెప్పాలని కంపెనీలకు సూచించింది.  

స్థానికులు దొరకటం లేదని చెప్పొద్దు 

కొత్త నిబంధనలు పూర్తిగా ప్రకటించనప్పటికీ అత్యంత కీలకమైన ‘ప్రత్యేక వృత్తి’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చినట్టు డీహెచ్‌ఎస్‌ తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం, అమెరికాలో వృత్తి నిపుణులు లభించటం లేదన్న కారణంతో కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకొనేందుకు వీలుండదు. కచ్చితంగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. నిబంధనలు అతిక్రమించినట్టు ఫిర్యాదులు వస్తే ఉద్యోగులు పనిచేసే చోటికి నేరుగా వెళ్లి దర్యాప్తు జరిపేందుకు తాజా నిబంధనలు డీహెచ్‌ఎస్‌కు అధికారాలు ఇస్తున్నాయి. కరోనాతో ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి అనేక కష్టాలు పడుతున్న అమెరికాలోని భారతీయ నిపుణులకు ఈ నిబంధనలు శరాఘాతంలాంటివేనని నిపుణులు అంటున్నారు. 


logo