మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 09:47:27

రెండు సార్లు ఓటేయండి.. టెన్ష‌న్ పుట్టిస్తున్న‌ ట్రంప్‌

రెండు సార్లు ఓటేయండి.. టెన్ష‌న్ పుట్టిస్తున్న‌ ట్రంప్‌

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఆ దేశ ఎన్నిక‌ల అధికారుల‌ను టెన్ష‌న్‌లో ప‌డేశారు. నార్త్ క‌రోలినాలో ప్ర‌చారం కోసం వెళ్లిన ట్రంప్‌.. అక్క‌డ మాట్లాడుతూ.. ప్ర‌జ‌లు రెండు సార్లు ఓటేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌న్నారు.  అధ్య‌క్ష ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే కోవిడ్ నేప‌థ్యంలో మెయిల్  ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. దీన్ని ట్రంప్ వ్య‌తిరేకిస్తున్నారు. మెయిల్ ఓటింగ్ ద్వారా డెమోక్ర‌టిక్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే నార్త్ క‌రోలినా ప్ర‌జ‌లు రెండు సార్లు ఓటు వేయాల‌న్నారు. తొలుత మెయిల్ ద్వారా ఓటు వేయ‌డం.. ఆ త‌ర్వాత పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ ఓటును కూడా వినియోగించుకోవాల‌న్నారు. ఈ ప‌ద్ధ‌తిలో ఓటింగ్ నిర్వ‌హిస్తే, అక్ర‌మాలు జ‌ర‌గ‌వ‌న్నారు.    

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రెండు సార్లు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం నేరం. ఆ దేశ ఎన్నిక‌ల సంఘం కూడా ఇదే చెబుతున్న‌ది.  రెండుసార్లు ఓటు వేయాల‌ని ట్రంప్ కామెంట్ చేయ‌గానే.. నార్త్ క‌రోలినా ఎన్నిక‌ల బోర్డు ప్ర‌క‌ట‌న జారీ చేసింది.  రెండు సార్లు ఓటు వేయ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌న్న‌ది.  ఫెడ‌ర‌ల్ చ‌ట్టానికి విరుద్ధ‌మ‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది. ట్రంప్ ఆ వ్యాఖ్య‌లు చేసి నేరానికి పాల్ప‌డిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ఆరోపిస్తున్నారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించాల‌ని అధ్య‌క్షుడు రెచ్చ‌గొట్ట‌డం స‌రికాదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌కు వెళ్లి మెయిల్ ద్వారా పంపిన ఓటును లెక్కించారా లేదో చూసుకోవాల‌ని, ఒక‌వేళ ఓటును లెక్కిస్తే, అప్పుడు మ‌రోసారి ఓటు వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, అంటే మెయిల్ ప‌ద్ధ‌తిలో ఓటింగ్ ప్ర‌క్రియ స‌జావుగా సాగుతుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు అని ట్రంప్ తెలిపారు.  నార్త్ క‌రోలినాలోని పోలింగ్ సెంట‌ర్ల‌లో ఎల‌క్ట్రానిక్ పోల్ బుక్స్ ఉంటాయి. వాటిల్లో ఎవ‌రు ఓటేశారో తెలిసిపోతుంది. ఓటు వేసిన వారి పేర్లు, వివ‌రాలు ఎల‌క్ట్రానిక్ బోర్డుపై క‌నిపిస్తాయి. ఒక‌వేళ మీ పేరు లేకుంటే, అప్పుడు మీరు బ్యాలెట్ ఓటు వేయాల‌ని ట్రంప్ అన్నారు.  అయితే క‌రోనా నేప‌థ్యంలో మెయిల్ ఓటు వేసిన వారు పోలింగ్ బూత్‌కు రావ‌ద్దు అని, వారి ఓటింగ్ వివ‌రాల‌ను ఎల‌క్ష‌న్ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు అని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు.
logo