గురువారం 28 మే 2020
International - May 16, 2020 , 12:03:37

ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్‌.. ఏడాదిలోగా వ్యాక్సిన్ !

ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్‌.. ఏడాదిలోగా వ్యాక్సిన్ !

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారీని వేగ‌వంతం చేశారు.  దీని కోసం అమెరికా .. ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్ చేప‌ట్టింది.  ఈ ఏడాది చివ‌రిలోగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు.  వ్యాక్సిన్ అభివృద్ధి ప‌నులను మ‌రింత వేగ‌వంతం చేసేందుకు ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్ చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. ఒక‌వేళ వ్యాక్సిన్‌ను కొనుగొన‌లేక‌పోయినా.. అమెరికా మాత్రం సాధార‌ణ జీవ‌న ప‌ద్ధ‌తుల్ని అల‌వాటు చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని ట్రంప్ అన్నారు. 

వైట్‌హౌజ్‌లోని రోజ్‌గార్డెన్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్‌కు సంబంధించి వివ‌రాల‌ను ట్రంప్ వెల్ల‌డించారు. ఆ స‌మ‌యంలో వైద్య‌, సైన్య‌, క్యాబినెట్ అధికారులు కూడా ఉన్నారు. ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్‌ను ఆయ‌న మ‌న్‌హ‌ట్ట‌న్ ప్రాజెక్టుతో పోల్చారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో తొలి న్యూక్లియ‌ర్ ఆయుధాన్ని క‌నుగొనేందుకు ఆ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఆపరేష‌న్ వార్ప్ స్పీడ్ అంటే.. ఇది భారీ ఆప‌రేష‌న్ అని, చాలా వేగంగా వ్యాక్సిన్ త‌యారీ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీంట్లో సైన్యం కూడా భాగ‌స్వామ్యం అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 

వ్యాక్సిన్ త‌యారీలో సుమారు 14 మేటి కంపెనీలు ఉన్నాయ‌న్నారు.  కానీ త‌మ ప్ర‌భుత్వం మాత్రం కేవ‌లం కొన్ని కంపెనీల‌పైనే పెట్టుబ‌డి పెట్టేందుకు ఆస‌క్తిగా ఉంద‌న్నారు. ఈ ఆప‌రేష‌న్‌లో  గ్లాక్సోస్మిత్‌క్లైన్ సీఈవో మోన్‌సెఫ్ స్లావోయి చీఫ్ అడ్వైజ‌ర్‌గా ఉంటారు.  ఈ ప్రోగ్రామ్‌లో  యూఎస్ ఆర్మీ మెటీరియ‌ల్ క‌మాండ్‌కు చెందిన జ‌న‌ర‌ల్ గుస్తావే పెర్నా చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా ఉంటారు. వాక్సిన్ అభివృద్ధిలో చైనాతో పాటు ఇత‌ర దేశాల‌తోనూ క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు చెప్పారు.  


logo